Begin typing your search above and press return to search.

తమిళనాడును తొలుత పాలించింది తెలుగోళ్లే.. తేల్చేసిన మండలి!

విజయవాడ కేంద్రంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా సాగిన ఈ సభలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:22 AM GMT
తమిళనాడును తొలుత పాలించింది తెలుగోళ్లే.. తేల్చేసిన మండలి!
X

విజయవాడ కేంద్రంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా సాగిన ఈ సభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ మహాసభల ముగింపు సమావేశాల సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షుడు.. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆసక్తికర ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మిస్ కాకుండా తెలుసుకోవాల్సిన విషయాల్ని మండలి చెప్పారు.

ఇంతకూ ఆయన మాటల్ని ఏ ప్రాతిపదికన తీసుకోవాలి? అన్న సందేహం రావొచ్చు. మండలి బుద్ధ ప్రసాద్ రాజకీయ నాయకుడే కావొచ్చు. తెలుగు భాష మీద.. చరిత్ర మీద పట్టున్న అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో ఒకరన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలుగోళ్లకు సంబంధించిన ఏ చారిత్రక అంశం మీద అయినా ఆయనకు సాధికారత ఉంది. అందుకే.. ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకోవటంలో ఎలాంటి తప్పు లేదు.

ఇంతకూ ఆయన తాజాగాచెప్పిన మాటల్లో కీలకమైన అంశాలేమంటే.. ఇటీవల సినీ నటి కస్తూరి మాట్లాడుతూ తెలుగు వారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తమిళనాడుకు చెందిన తెలుగువారు సేవకులుగా తమిళనాడుకు వలస వచ్చినట్లుగా ఆమె చెప్పటం.. దానిపై తర్వాత క్షమాపణలు చెప్పటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మండలి.. ‘ఆ సినీ నటి చెప్పిన మాటలు నిజం కాదు. తమిళనాడుకు తెలుగువారు సేవకులుగా వచ్చారని చెప్పారు. కానీ.. తమిళనాడును మొదట పాలించింది తెలుగువారే. ఆ తర్వాతే తమిళులు పాలించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రిగా పని చేసింది కూడా తెలుగువారే. శ్రీక్రిష్ణ దేవరాయులు.. రాణి మంగమ్మ.. నాయరాజులు తెలుగులోనే పాలన చేవారు. తమిళనాట తెలుగు ఒక వెలుగు వెలిగిందే తప్ప.. దాస్య ప్రవ్రత్తితో తెలుగువారు అక్కడ లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అంటూ చరిత్రను సవివరంగా చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించేందుకు తమిళులు ఎవరూ ముందుకు రాలేదని.. సైమన్ కమిషన్ వస్తే పిస్టల్ గుండుకు ఎదురుగా గుండె చూపిన వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉప్ప సత్యాగ్రహానికి గాంధీ పిలుపునిస్తే.. కాశీనాథుని నాగేశ్వరరావు.. ప్రకాశం పంతులు.. దుర్గాభాయమ్మ నాయకత్వం వహించారన్నారు.

మద్రాసు నగరంలో ఏ ప్రోగ్రాం విజయవంతంగా జరిగినా.. దాన్ని నడిపించిన ఘనత తెలుగువారిదేనన్న మండలి.. మనలో భాషాభిమానం.. జాతీయభిమానం తగ్గిందన్న విచారాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో ఉన్న తెలుగువారు.. తెలుగువారిగా నమోదు చేసుకోకపోవటం కారణంగా రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష నాలుగో స్థానానికి పడిపోయిందన్నారు. త్వరలో జరిగే జనగణనలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి.. తాను తెలుగు వ్యక్తినని నమోదు చేసుకోవటం ద్వారా తెలుగు భాషను రెండో స్థానానికి తీసుకెళ్లాలన్నారు. మండలి చెప్పిన ఈ కీలక అంశాల్ని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగోడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.