Begin typing your search above and press return to search.

టీడీపీలో బుద్దా వెంక‌న్న ఒంట‌ర‌య్యారా .. ఒంట‌రిని చేశారా... !?

చంద్ర‌బాబు కోసం ర‌క్త త‌ర్ప‌ణ చేసి.. మ‌రీ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసిన‌.. నాయ‌కుడు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌.

By:  Tupaki Desk   |   12 Dec 2024 9:30 PM GMT
టీడీపీలో బుద్దా వెంక‌న్న ఒంట‌ర‌య్యారా .. ఒంట‌రిని చేశారా... !?
X

చంద్ర‌బాబు కోసం ర‌క్త త‌ర్ప‌ణ చేసి.. మ‌రీ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసిన‌.. నాయ‌కుడు విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌. అంతేకాదు.. పార్టీ అధినేత చంద్ర‌బాబును నాన్న‌గారు.. అని సంబోధించే ఏకైక నాయ‌కుడు కూడా ఆయ‌నే. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్లు ఆశించారు.కానీ, ద‌క్క‌లేదు. దీంతోనే ర‌క్త త‌ర్ప‌ణం అంటూ.. కొత్త వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చారు. కానీ, అప్పుడు కూడా.. పార్టీ క‌రుణించ‌లేదు. ఇక‌, నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నా స‌క్సెస్ కాలేదు.

క‌ట్ చేస్తే.. కొన్నాళ్లు మౌనంగా ఉన్న బుద్ధా వెంక‌న్న ఇటీవ‌ల వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగారు. ఆ వెంట‌నే విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబును క‌లిసి.. ఫిర్యాదు చేశారు. త‌క్ష‌ణ‌మే సాయిరెడ్డిపై కేసు న‌మోదు చేయాల‌ని కోరారు. లేక‌పోతే.. నిర‌స‌న కూడా చేప‌డ‌తాన‌న్నారు. క‌ట్ చేస్తే.. ఇది జ‌రిగి మూడు రోజులు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు బుద్ధా ఇచ్చిన ఫిర్యాదు ఎటు పోయిందో ఏమైందో ఎవ‌రికీ తెలియ‌దు.

అయితే.. ఇలా కావ‌డానికి కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సొంత పార్టీలోనే సొంత అజెండా ను అమ‌లు చేస్తున్నార‌న్న వాద‌న బుద్ధా చుట్టూ కొన్నాళ్లుగా గిరికీలు కొడుతోంది. పైగా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌న్న‌.. ఆవేద‌న‌, ఆగ్ర‌హం కూడా ప‌శ్చిమ నియొజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సుజ‌నాకు ఉంది. ఇక‌, బుద్ధాను బ‌లోపేతం చేయ‌డం ఇష్టం లేని క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా ఉన్నారు. ఇలా.. బుద్ధా వెంక‌న్న దాదాపు సొంత పార్టీలోనే ఎగ‌స్పార్టీని ఎదుర్కొంటున్నారు.

దీంతో బుద్దా చేసిన ఫిర్యాదు బుట్ట దాఖ‌లైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నోటి దూకుడు ఉన్నా.. అది ప్ర‌త్య‌ర్థుల‌పై చూపిస్తే బాగానే ఉంటుంద‌ని.. కానీ.. త‌ర‌చుగా సొంత నేత‌ల‌పైనా చూపిస్తున్నార‌ని.. అందుకే బుద్ధా ఒంట‌రి అవుతున్నార‌న్న‌దివిశ్లేష‌కుల మాట‌. పైగా.. పార్టీ అధినేత‌తో నేరుగా సంబంధాలు ఉన్న నాయ‌కుల‌తో ఆయ‌న అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం కూడా..ఆయ‌న పొలిటిక‌ల్ గ్రాఫ్‌పై ప్ర‌భావం చూపిస్తోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా.. త‌న పంథా మార్చుకుంటే త‌ప్ప‌.. బుద్ధా రాజ‌కీయాలు దూసుకుపోయే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు.