Begin typing your search above and press return to search.

''కండువా మారింది.. ఇప్పుడు నేను జ‌న‌సైనికుడిని''

కానీ, ఇంతలో ఏం జ‌రిగిందో ఏమో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీలోకి పిలిచి.. కండువా క‌ప్పి.. టికెట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది

By:  Tupaki Desk   |   9 April 2024 3:30 PM GMT
కండువా మారింది.. ఇప్పుడు నేను జ‌న‌సైనికుడిని
X

రాజ‌కీయాల్లో కండువాలు మార్చేయ‌డం.. పార్టీలు జంప్ చేయ‌డం నాయ‌కుల‌కు తేలికే అయినా.. క్షేత్ర‌స్థా యిలో కేడ‌ర్‌ను ఆదిశ‌గా ఒప్పించ‌డం.. వారితో జై కొట్టించ‌డం.. నాయ‌కుల‌కు అంత ఈజీకాదు. కండువా మార్చినంత తేలిక‌గా.. కేడ‌ర్‌ను ఒప్పించ‌డం తేలిక కాదు. ఇదే విష‌యం ఇప్పుడు సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ద ప్ర‌సాద్‌కు ఎదురైంది. ఇటీవ‌ల ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో అలిగి.. ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్య‌లు సంధించారు. రాజ‌కీయాలు వెగ‌టు పుడుతున్నాయ‌న్నారు.

కానీ, ఇంతలో ఏం జ‌రిగిందో ఏమో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీలోకి పిలిచి.. కండువా క‌ప్పి.. టికెట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, మండ‌లి వంటి నిజాయితీప‌రుడైన నాయ‌కుడు ఇలా చేయ‌డంపై క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న కేడ‌ర్ నివ్వెర పోయింది. దీంతో స‌హ‌కారంపై ఆయ‌నకు సందేహాలు ముసురుకున్నాయి. దీనినే ఆయ‌న తాజాగా కార్న‌ర్ చేస్తూ.. కండువా మారింది.. ఇప్పుడు నేను జ‌న‌సైనికుడిని! అని ప్ర‌చారం చేసుకుంటున్నారు. అంతేకాదు.. అనేక సర్వేలతోనే పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సీటు త‌న‌కు ఇచ్చార‌ని, రాత్రికి రాత్రి కండువాలు మార్చి టికెట్ తీసుకోలేదని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ నా భుజాన జనసేన కండువా కప్పిన క్షణం నుంచి నేను జనసైనికుడిని అని బుద్ధప్రసాద్ చెప్పారు. ''నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు. జనసైనికులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. టీడీపీ వాళ్ళకే గుర్తింపు ఇస్తాననే అనుమానం వదిలేయండి. పొత్తు నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్నికల్లో విజయం సాధించి జనసేన పార్టీని నియోజకవర్గంలో అజేయమైన శక్తిగా తీర్చిదిద్దుతా. నిస్వార్ధ ఎమ్మెల్యేల నియోజకవర్గం అవనిగడ్డకు ప్రస్తుత ఎమ్మెల్యే అప్రతిష్ట తెచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఐదేళ్లలో విపరీతంగా ఇసుక, బుసక, మట్టి దోపిడీ చేశారు'' అంటూ మండ‌లి వ్యాఖ్యానించారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారని బుద్ద ప్రసాద్ వ్యా ఖ్యానించారు. జగన్ నుంచి విముక్తి కలగకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్ లేదని పవన్ కళ్యాణ్ గ్రహించి చేసిన త్యాగాన్ని జనసైనికులు మరువకుండా ఎన్నికల్లో సమిష్టిగా పని చేయాలని బుద్ద ప్ర‌సాద్ పిలుపు నిచ్చారు. అయితే.. ఆయ‌నకు స్తానిక జ‌న‌సేన నాయ‌కులు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌ని నేప‌థ్యంలోనే ఇలా ప్ర‌చారం చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.