Begin typing your search above and press return to search.

జూ.ఎన్టీఆర్ కి టీడీపీతో సంబంధం లేదట... స్వామి భక్తి పీక్స్?

తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న... అసలు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి ఏమిటి సంబంధం అని ప్రశ్నించినంత పనిచేశారు.

By:  Tupaki Desk   |   25 May 2024 3:55 AM GMT
జూ.ఎన్టీఆర్  కి టీడీపీతో సంబంధం లేదట... స్వామి భక్తి పీక్స్?
X

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. జూన్ 4 న ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరు అధికారంలోకి వస్తారు, ఇంకెవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది స్పష్టం అవుతోంది! ఈలోపు తెరపైకి వస్తున్న జోస్యాలు, విశ్లేషణలు ఒకెత్తు అయితే... తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఒక చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఎదురుచూస్తున్న పరిస్థితి! ఈ సమయంలో... కూటమి అధికారంలోకి రావడం కన్ఫాం.. ఫలితంగా చంద్రబాబు సీఎం అవ్వడం కూడా కన్ఫాం.. అందువల్ల పార్టీ అధ్యక్ష బాధ్యతలు యువ కిశోరం నారా లోకేష్ కు ఇవ్వాలని టీడీపీ నేతల నుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు ఎవరైనప్పటికీ.. ప్రయాణం హాయిగానే సాగిపోతుంది.. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కత్తిమీద సాములా ఉంటుంది ప్రయాణం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ స్పందించారు బుద్దా వెంకన్న.

తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న... అసలు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీకి ఏమిటి సంబంధం అని ప్రశ్నించినంత పనిచేశారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ తరుపున ప్రచారం చేయలేదని, పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు! అయితే... ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని అనడం గమనార్హం.

దీంతో ఈ వ్యాఖ్యలపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా... జూనియర్ ఎన్టీఆర్ కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక, చంద్రబాబు కావాలనే జూనియర్ ని దూరం పెట్టారా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు! టీడీపీ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే అంతెత్తున లేచి పడుతున్నది ఎవరు అని నిలదీస్తున్నారు!

మరోపక్క తెలుగుదేశం పార్టీ నందమూరి వారిది అనేది పాత మాట.. టీడీపీ నారా వారి సొత్తు అనేది తాజా మాట అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరోపక్క.. బుద్దా వెంకన్న స్వామి భక్తి కాస్తా లేనిపోని సమస్యలు తెచ్చేలా ఉందనేవారూ లేకపోలేదు! ఏది ఏమైనా... ఎన్నికల ఫలితాల వేళ టీడీపీలో ఈ తరహా చర్చ వెనుక ఉన్న వ్యూహం ఏమిటని ప్రశ్నించేవారూ తెరపైకి వస్తుండటం గమనార్హం!