బుద్ధా వెంకన్నది అలాంటి ఇలాంటి బాధ కాదుగా..?
బుద్ధా వెంకన్న. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్ కూడా.
By: Tupaki Desk | 5 Aug 2024 3:45 AM GMTబుద్ధా వెంకన్న. విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్ కూడా. గతంలో ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కాస్తా అయిపోయింది. పార్టీ అధికారంలో లేక పోవడంతో బుద్దా వెంకన్న గత మూడేళ్లుగా ఖాళీగా ఉన్నారు. అయినప్పటికీ.. పార్టీ కోసం గళం వినిపించారు. అప్పటి సీఎం జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారికి బహిరంగంగానే ఆయన వార్నింగులు ఇచ్చారు.
ఇక, ఎన్నికలకు ముందు బుద్ధా చేసిన రక్త తర్పణం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. విజయవాడ వెస్ట్ కానీ.. అనకాపల్లి ఎంపీ సీటును కానీ.. తనకు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే.. చంద్ర బాబు మాత్రం ఆయనకు ఏదీ ఇవ్వలేక పోయారు. దీంతో ఇప్పుడు సర్కారు ఏర్పడిన తర్వాత.. కనీసం నామినేడెట్ పదవి అయినా దక్కుతుందని అనుకున్నారు. అది కూడా దక్కలేదు. దీంతో తాజాగా తన మనసులో మాట చెప్పేసుకున్నారు. విజయవాడ ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా సంచలన వ్యాఖ్యలే చేశారు.
తనకు ఎలాంటి పదవి లేక పోవడంతో ఏ పనినీ చేయలేకపోతున్నానని..తన మాటను ఎవరూ వినిపించు కోవడం లేదని బుద్ధా బహిరంగ వేదికగానే చెప్పారు. తద్వారా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టారు. ఇంకా ఎన్నాళ్లు వేచిఉండాలని ఆయన ప్రశ్నించారు. దీనిని అంత తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. బుద్ధా బాధ.. ప్రస్తుతానికి బయట పడినా.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు దాదాపు ఇదే బాధలో ఉన్నారు.
చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందు టికెట్లు త్యాగం చేశారు. మరికొందరు సొమ్ములు ఖర్చు చేశారు. చంద్రబాబు కోసం.. గ్రూపులు కట్టి.. తమకు ఏమాత్రం ఇష్టం లేని వారితో కూడా కలిసి పని చేశారు. అయితే.. నెలలు గడుస్తున్నా.. తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేక పోతున్నారనే వాదన , ఆవేదన కూడా వారిలో ఉంది. దీంతో అలాంటి వారంతా మౌనంగా ఉంటున్నారు. ఎవరూ బయట పడేందుకు సాహసించడం లేదు. కానీ, బుద్ధా తాజాగా బయటపడ్డారు. దీంతో ఇప్పటికైనా చంద్రబాబు స్పందిస్తే.. కొంత మేరకు అసంతృప్తి తగ్గుతుందని అంటున్నారు.