నారా దేవాన్ష్ ఓకే.. జూనియర్ ఎన్టీఆర్ నాట్ ఓకే
తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే విషయంలో ఎప్పట్నంచో ఒక చర్చ.. వాదనలు నడుస్తున్నాయి
By: Tupaki Desk | 16 Aug 2024 1:32 PM GMTతెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే విషయంలో ఎప్పట్నంచో ఒక చర్చ.. వాదనలు నడుస్తున్నాయి. చంద్రబాబు అభిమతం అయితే తన కొడుకు నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలనే. ఈ దిశగానే కొడుకుని ప్రమోట్ చేశారు. మొదట్లో ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిపోవడంతో లోకేష్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అతణ్ని బలవంతంగా పార్టీ మీద రుద్దుతున్నారనే భావన నెలకొంది. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. లోకేష్ తన లోపాలను దిద్దుకున్నాడు. జనంలో తిరిగాడు. ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఐతే ఇప్పటికీ లోకేష్‌ను వ్యతిరేకిస్తూ.. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నడిపించాలని కోరుకునేవాళ్లు టీడీపీ మద్దతుదారులు, నందమూరి అభిమానుల్లో లేకపోలేదు.
ఐతే ఎన్టీఆర్ ఊసు ఎత్తితే చాలు.. టీడీపీలోని చాలామంది నాయకులు తేలిగ్గా తీసిపడేస్తుంటారు. అలాంటి వారిలో కృష్ణాజిల్లా నేత బుద్ధా వెంకన్న కూడా ఒకడు. నారా లోకేష్‌కు ఎప్పుడూ ఎలివేషన్లు ఇస్తూ ఉండే ఈ నేత.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో టీడీపీలో భవిష్యత్ నాయకత్వం గురించి మాట్లాడారు. తాను చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్‌ల నాయకత్వానికి జై కొట్టానని.. భవిష్యత్తులో నారా దేవాన్ష్ రాజకీయాల్లోకి వచ్చినా తన కోసం పని చేస్తానని బుద్ధా వెంకన్న అన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సంగతి ఏంటి అని అడిగితే.. అతడి నాయకత్వాన్ని ఒప్పుకునే పరిస్థితే లేదని ఆయన తేల్చేశారు. గత ఐదేళ్లలో నారా లోకేష్ ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టాడని.. తన నాయకత్వం గురించి ప్రశ్నించేవాళ్లందరికీ సమాధానం చెప్పాడని.. అలాంటి నాయకుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని ఆయనన్నారు.