బుద్ధా వెంకన్న 'రక్త రాజకీయం'
ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేశారు. రక్తంతో గోడపై "సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే" అంటూ రాశారు.
By: Tupaki Desk | 18 Feb 2024 8:51 AM GMTవిజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రక్త రాజకీయాలకు తెరదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను పశ్చిమ నుంచే పోటీ చేస్తానని.. తన జీవితంలో ఇదే తొలి, మలి సారని ఆయన తరచుగా చెబుతున్నారు. అయితే..ఈయన డిమాండ్‌ను చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేశారు. రక్తంతో గోడపై "సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే" అంటూ రాశారు. కొన్ని వాస్తవాలు చంద్రబాబుకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు.
నానీ వల్ల నష్టపోయా
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. "నా దారిద్ర్యానికి కేశినేని నాని వచ్చాడు. నన్ను పశ్చిమ నియోజకవర్గ నుంచి తీసేసి వేరే వాళ్లని పెట్టాలని కోరాడు. చంద్రబాబు నన్ను విజయవాడ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. 6 ఏళ్లు పని చేశాను. మూడు జిల్లాలకు ఇంచార్జిగా చంద్రబాబు నన్ను నియమించారు. చంద్రబాబుపై దాడి జరిగితే ఎవడూ మాట్లాడలేదు. నేను పోరాటం చేశాను. జోగి రమేశ్‌పై గొడవకు వెళ్లనప్పుడు సొమ్ము సిల్లి పడిపోయాను. పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలో చంద్రబాబుకి, లోకేశ్‌కి చెప్పాను. అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చోవాలని కోరుతున్నాను. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. విదేయులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి" అని బుద్ధా వెంకన్న అన్నారు.
రక్త రాజకీయం తొలిసారి..
సాధారణంగా.. రాజకీయ నేతలు.. తన పార్టీ అధినేత కోసం రక్తం ధారపోస్తామని కామెంట్లు చేస్తుంటారు. కానీ, బుద్దా వెంకన్న ఇలా అనలేదు కానీ.. చేసి చూపించడం గమనార్హం. తన రక్తంతో చంద్రబాబు కాళ్లు కడిగారు. "కొడాలి నాని, వంశీ, కేశినేని నాని టైప్ కాదు. నా రక్తం మొత్తం చంద్రబాబే. నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను. ఎవరి మీదకైనా దూకేశక్తి, సైన్యం నాకు ఉంది. పార్టీలో ఉండి విన్నా.. వినిపించనట్టుగా నటించే మూగోళ్లు, చెవిటోళ్లు ఉన్నారు. చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేస్తే ఒక్కడు మాట్లాడరు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా సీబీఎన్ జిందాబాద్ అనే అంటాను" అని వ్యాఖ్యానించారు. మరి దీనిపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.