Begin typing your search above and press return to search.

కేంద్ర బ‌డ్జెట్‌: నేచుర‌ల్ వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట

దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచామ‌ని చెప్పారు.

By:  Tupaki Desk   |   23 July 2024 6:34 AM GMT
కేంద్ర బ‌డ్జెట్‌: నేచుర‌ల్ వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట
X

కేంద్ర బ‌డ్జెట్‌లో నేచుర‌ల్ వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. పురుగు మందుల వినియోగం... త‌గ్గించ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ హిత వ్య‌వ‌సాయానికి ప్రోత్సాహం అందించ‌నున్న‌ట్టు చెప్పారు. అదేవిధంగా ఆర్థిక స‌ర్వే వెల్ల‌డించిన ఆహార ధ‌ర‌ల పెరుగుద ల‌ను క‌ట్టడి చేసేందుకు ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది. దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచామ‌ని చెప్పారు. (అయితే.. దీనిని చ‌ట్ట‌బ‌ద్ధం చేయాల‌న్న రైత‌లు డిమాండ్ల‌ను వ‌దిలేశారు)

కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. కానీ, వాస్త‌వానికి త‌మ‌కు 10 శాతం మిగులు కూడా ద‌క్క‌డం లేద‌న్న‌ది రైతుల ఆవేద‌న‌. ఇక‌, విద్య, నైపుణ్యాభి వృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. దీనిని రుణాల రూపంలో అందిస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం విశేషం.

న‌వ‌న‌వోన్మేషంగా..

ఈ సారి బ‌డ్జెట్‌ను 9 ప్రధానాంశాల ఆధారంగా రూపొందించిన‌ట్టు సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. వ్యవసాయం లో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానంగా ఉంటుంద‌ని వివ‌రించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 నూతన వంగడాలను అభివృద్ధిలోకి తెస్తామ‌ని తెలిపారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం దిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్టు తెలిపారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచి.. త‌ద్వారా.. చ‌మురు దిగుమ‌తులు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

కూరగాయల సప్లయ్‌ చైన్‌ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం క‌ల్పిస్తామ‌ని.. త‌ద్వారా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. వీటికి సంబంధించి సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్లమంది రైతుల డేటా సేకరణ పూర్త‌యిన‌ట్టు వివ‌రించారు. అదేస‌మ‌యంలో సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాల రూపకల్పనకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్న‌ట్టు నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. తయారీరంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుంద‌ని వెల్ల‌డించారు. అంటే.. హోట‌ల్ ప‌రిశ్ర‌మ‌ల‌ను పుంజుకునేలా చేయ‌డం ద్వారా.. స‌ర్కారు ఉపాధి క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు.