బడ్జెట్ సమగ్ర 'మోడీ' స్వరూపం!
మొత్తంగా చూస్తే.. 2014కు ముందు అసలు దేశంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ప్రజలు తినేందుకు తిండి కూడా లేనంతగా ఉన్నదనే భ్రమను కల్పించడంలో నిర్మలమ్మ సభ వరకు సక్సెస్ అయ్యారు
By: Tupaki Desk | 1 Feb 2024 10:14 AM GMTతాజాగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ సమగ్ర స్వరూపం పరిశీలిస్తే.. మోడీ విశ్వరూపం సాక్షాత్కరిస్తోంది. మోడీ వలన , మోడీ చేత.. అన్నట్టుగా.. బడ్జెట్ ప్రసంగమే కాదు.. ప్రవేశ పెడుతున్న పథకాలు.. ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాలను వండి వార్చారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీపై 10 సార్లు పొగడ్తల జల్లు కురిపించారు. 12 సార్లు మోడీ నామ స్మరణ చేశారు.
మొత్తంగా చూస్తే.. 2014కు ముందు అసలు దేశంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ప్రజలు తినేందుకు తిండి కూడా లేనంతగా ఉన్నదనే భ్రమను కల్పించడంలో నిర్మలమ్మ సభ వరకు సక్సెస్ అయ్యారు. కానా.. మధ్యలో అదే బీజేపీకి చెందిన వాజపేయి పాలించారన్న విషయాన్ని ఆమె మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఇక, 2014 తర్వాతమాత్రమే దేశం గుర్తింపు పొందిందని.. అభివృద్ది పథంలో నడుస్తోందని.. పేదలకు కడుపు నింపుతున్నామని.. ఇదంతా మోడీ దూరదృష్టి.. ఆలోచన.. పేదలకు ఏదైనా చేయాలన్న తలంపేనని ఆమె వెల్లడించారు.
ఇక, వచ్చే మూడు మాసాలకు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దేవంలో కొత్త 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. 3 ఎకనామిక్ , లాజిస్టిక్ కారిడార్ లను నిర్మించనున్నట్టు చెప్పారు. 40 వేల నార్మల్ బోగీలను వందేభారత్ మోడ్‌లో అభివృద్ది చేస్తామన్నారు.`ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ కలలు కంటున్న వికసిత బారత్ కోసం.. ఈ లక్ష్యాలను సాధించే రాష్ట్రాలకు .. 75 వేల కోట్లను ఎలాంటి వడ్డీలు లేకుండా.. అప్పులుగా ఇవ్వనున్నాం`` అని నిర్మలమ్మ ప్రకటించారు.
అంటే.. మోడీ అమలు చేసే పథకాలను రాష్ట్రాలు ముందుకు తీసుకువెళ్లాలనే విషయాన్ని స్పష్టం చేశారు. యువతకు ఈ పదేళ్ల కాలంలో ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. 80 కోట్ల మందిపేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేశామని వివరించారు. రైతుల ఖాతాల్లోకి 2 లక్షల కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ చేశామని చెప్పుకొచ్చారు. ఇక, జన్‌ధన్ ఖాతాల్లో పేదలకు రూ.34 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఇలా.. మొత్తం.. బడ్జెట్ ప్రసంగంలో మోడీ స్మరణతో పాటు.. ఈ పదేళ్లలో చేసిన సాయాన్ని ఊదర కొట్టడం ద్వారా.. మోడీ సమగ్ర స్వరూపాన్ని చూపించినట్టయిందనే విమర్శలు వస్తున్నాయి.