వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే.. బుద్ధా వారి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్?
అయినప్పటికీ.. నాయకులు మాత్రం మారడం లేదు. పార్టీ కోసం పెద్దగా పనిచేస్తున్న దాఖలా కనిపించ డం లేదు.
By: Tupaki Desk | 11 Dec 2023 1:30 AM GMT2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్లు దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు సామ దాన ఉపాయాలను పక్కన పెట్టేసి.. భేద, దండోపాయాల వరకు దిగిపోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు టికెట్ ఇస్తే తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేనట్టుగా వ్యవహరిస్తున్నా రు. ఇలాంటి వారికి పార్టీ అధినేత చంద్రబాబు తరచుగా వాతలు పెడుతూనే ఉన్నారు. హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ.. నాయకులు మాత్రం మారడం లేదు. పార్టీ కోసం పెద్దగా పనిచేస్తున్న దాఖలా కనిపించ డం లేదు. ఇదిలావుంటే, తాజాగా టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచ లన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఉన్న ఆయన.. అనూహ్యంగా విజయ వాడ పశ్చిమ టికెట్‌పై కన్నేశారు. గత ఎన్నికల్లోనే ఈ టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు అనూహ్యం గా దెబ్బతగిలింది.
అయితే, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టికెట్‌ను తనకే కేటాయించాలని కోరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇవ్వకపోతే.. తన దగ్గర `ప్లాన్ బి` కూడా ఉందని హెచ్చరించారు. దీనినే బ్లాక్ మెయిల్ రాజకీయాలని అంటున్నారు.. సీనియర్లు. బీసీ.. (నగరాలు కులం) సామాజిక వర్గానికి చెందిన బుద్ధా వెంకన్న పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు.
చంద్రబాబుకు అనుకూల నాయకుడిగా.. పార్టీ ఫైర్ బ్రాండ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై విరుచుకుపడడంలోనూ ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. తర్వాత.. ఉత్తరాంధ్ర జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇంత చేసినా.. ఇప్పుడు అధినేతకు చెప్పారో లేదో తెలియదు కానీ.. వెస్ట్ సీటును మాత్రం ఇచ్చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇవ్వకపోతే.. ప్లాన్ బి అంటూ.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తుండడంతో ఈ విషయంపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.