బిహార్‌ను శాసిస్తున్న బుల్లి పార్టీ.. నలుగురు ఎమ్మెల్యేలే నరనారాయణలు!!
ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా నితీష్ రాజీనామా చేయడం.. చర్చనీయాంశం అయింది.
By: Tupaki Desk | 28 Jan 2024 10:54 AM GMTతాజాగా బిహార్ రాజకీయాల్లో పెనుకుదుపు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మహాఘట్‌బంధనాన్ని వదులకుని సీఎం నితీశ్‌కుమార్ బయటకు వచ్చారు. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో దాదాపు రెండేళ్ల పాటు కొనసాగాల్సిన సర్కారు కూలిపోయింది. వాస్తవానికి వచ్చే 2025 చివరిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా నితీష్ రాజీనామా చేయడం.. చర్చనీయాంశం అయింది. ఈ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది.
సీఎం నితీష్ రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. అయితే.. ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీతో బంధం పెట్టుకున్న నితీష్ తప్పుకోవడంతో ఆర్జేడీనే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులను కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. గత రెండు రోజుల నుంచి కాంగ్రెస్ సహా కమ్యూనిస్టు నేతలతో లాలూ, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లు చర్చలు జరుపుతున్నారు.
ఇది సక్సెస్ అయితే.. కొంత వరకు లాలూ కుటుంబానికి అధికారం దక్కే అవకాశం ఉంది. కానీ, అప్పటికీ 13 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ 234 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆర్జేడీ 79 మంది ఎమ్మెల్యేలతో పెద్దపార్టీగా ఉండగా.. బీజేపీ 78 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. ఇక, నితీశ్ నేతృత్వంలో జేడీయూ.. బలం 45 మంది మాత్రమే. ప్రస్తుతం రాజీనామా చేసిన నితీశ్.. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంటే.. 78+45 = 123 మంది సభ్యులు అవుతారు. సో.. సర్కారు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 122కు సరిపోయింది.
కానీ, ఇది నితీశ్ సర్కారుకు ఎప్పుడైనా దెబ్బే. ఇక, లాలూ విషయానికి వస్తే.. ఆర్జేడీ+కాంగ్రెస్+కమ్యూనిస్టు ల సీట్లు 114. వీరికి అధికారం దక్కాలంటే.. మరో ఎనిమిది మంది అవసరం. ఈ క్రమంలో నలుగురు మాత్రమే ఉన్న అవామీ లీగ్ పార్టీ ఇప్పుడు చక్రం తిప్పుతోంది. ఇటు ఆర్జేడీ నుంచి, అటు బీజేపీ నుంచి కూడా.. ఈ పార్టీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మీరు మద్దతిస్తే.. నలుగురికి మంత్రిపదవులు ఇస్తామని లాలూ సమాచారం పంపించారు. రెండు ఖాయమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో ఈ నలుగురు మాత్రమే ఉన్న అవామీ లీగ్ నిర్ణయం కీలకంగా మారింది. వీరు ఆర్జేడీకి మద్దతు ఇస్తే.. మరో నలుగురు అవసరం ఉంది. వీరిని ఏదో ఒక రకంగా తెచ్చుకోవచ్చని లాలూ వ్యూహం. మొత్తానికి బిహార్‌లో ఈ నలుగురు కీలక చక్రం తిప్పుతుండడం గమనార్హం.