బ్యూరోక్రాట్ పొలిటీషియన్స్: పాలనలో ప్లస్.. పొలిటికల్ మైనస్.. !
తాజాగా వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ రాజీనామా చేయడం.. స్వచ్ఛంద కార్యక్రమాలకు పరిమితం అవుతానని చెప్పడం తెలిసిందే.
By: Tupaki Desk | 28 Dec 2024 10:30 AM GMTరాష్ట్రంలో చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. వారంతా సక్సెస్ అయ్యా రా? అంటే.. కాదనే చెప్పాలి. ఎంతో మంది ఖద్దరు వేసుకునేందుకు ముందుకు వచ్చినా.. ప్రజలు వారం దరినీ గెలిపించలేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. వారు కూడా.. పొలిటికల్ హవాలో కొట్టుకు వచ్చిన జాబితానే కావడం గమనార్హం. తాజాగా వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ రాజీనామా చేయడం.. స్వచ్ఛంద కార్యక్రమాలకు పరిమితం అవుతానని చెప్పడం తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నారన్నది.. ఇప్పుడు చర్చకు దారితీసిన అంశం. వీవీ లక్ష్మీనారాయణ మాజీ సీబీఐ జేడీ సొంత పార్టీ పెట్టుకున్నారు. కానీ, సక్సెస్ కాలేక పోయారు. ఫలితం గా ఇప్పుడు ఆయన కూడా స్వచ్ఛంద సేవ చేసుకుంటున్నారు. విజయకుమార్... మాజీ ఐఏఎస్. ఈయన కూడా ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఎస్సీ అధికారి. అయితే.. ఆయన విషయంలోనూ ప్రజలు సానుకూలంగా స్పందించలేదు.
ఇక, తెలంగాణకు చెందిన సోమేష్‌కుమార్ కూడా.. తన ఐఏఎస్ గిరీకి రాజీనామా చేసి.. రాజకీయ కండువా కప్పుకొన్నారు. కానీ, ఆయన నేరుగా ఏ పార్టీ తరఫున పోటీ చేయకపోయినా.. సలహాదారుగా నియమితులయ్యారు. కానీ, అనుకున్న విధంగా పనులు ముందుకు సాగలేదు. దీంతో సోమేష్ అటు ఐఏఎస్, ఇటు రాజకీయం రెండూ కోల్పోయారు. ఇలా.. చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదవులు వదులుకుని పాడైన వారే ఉన్నారన్నది ఆసక్తికర విషయం.
ఇక, ఇంతియాజ్ విషయానికి వస్తే.. ఆయన చాలా తొందరపడ్డారని.. అప్పట్లోనే మీడియా చెప్పుకొచ్చింది. చాలా మంచి అవకాశం, భవితవ్యం కూడా ఉన్న ఇంతియాజ్.. ఇలా కెరీర్‌ను పక్కన పెట్టారన్న చర్చ కూడా వచ్చింది. అయినా.. ఆయన లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చారు. సుమారు 5 - 10 కోట్ల మధ్య ఖర్చు చేసినా.. ఫలితం దక్కలేదు. అయితే.. అలా ఉండి ఉంటే కొంత వరకు మైనారిటీల్లో మెప్పు పొందేవారు. కానీ, అలా చేయలేక పోయారు. స్వచ్ఛంద సేవ వైపు వెళ్తానని అంటున్నా.. కీలక పార్టీ ఒకటి ఆయనకు ఆఫర్లపై ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.