పిలిస్తే రారా? ఆలూరు ఎమ్మెల్యే అనుచరులు రచ్చ ఎంతంటే?
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు.. అనుచరులు రెచ్చిపోయారు. అది కూడా అలా ఇలా కాదు.
By: Tupaki Desk | 4 Oct 2024 4:52 AM GMTఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు.. అనుచరులు రెచ్చిపోయారు. అది కూడా అలా ఇలా కాదు. ప్రభుత్వ సంస్థపై దాడి చేయటమే కాదు.. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన వైనం చూస్తే.. పోలీసులు ఏం చేస్తున్నారు? అన్నది సందేహం కలుగక మానదు. కర్నూలు జిల్లా ఆలూరు.. దేవనకొండ.. ఆస్పరి మండలాల్లోని పవన్ విద్యుత్తు సంస్థల కార్యాలయాల్లోకి వెళ్లి దౌర్జాన్యానికి దిగటమే కాదు ఫర్నీచర్.. అద్దాలు ధ్వంసం చేసిన వైనం షాకింగ్ గా మారింది.
ఎంత కోపం ఉండే మాత్రం.. మరీ ఇంత విధ్వంసమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకు వీరి ఆగ్రహానికి కారణం.. తమ ఎమ్మెల్యే పిలిస్తే అధికారులు తమ వద్దకు రాలేదని. తమ ఎమ్మెల్యే అంటే భయం లేదన్న కారణాల్ని చెబుతున్నారు. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఆలూరు మండలంలోని మొలగవల్లి గ్రామ సమీపంలోని సీమన్స్ గమేషా కంపెనీకి చెందిన పవన విద్యుత్తు ఉప కేంద్రానికి ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు పది వాహనాల్లో 50 మంది వరకు వెళ్లారు.
అక్కడి సెక్యూరిటీ గార్డు సెల్ ఫోన్ లాక్కొని.. లోపలకు వెళ్లారు. అందరూ బయటకు వెళ్లిపోవాలని ఆదేశిస్తూ అద్దాలు పగలకొట్టి.. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అందరిని బయటకు పంపేసి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఈ విషయాన్ని గుంతకల్లు ఎమ్మెల్యే జయరాంకు చెప్పగా ఎమ్మెల్యే సోదరుడు.. మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ నారాయణ అక్కడకు చేరి తాళాన్ని పగలకొట్టారు. బయట ఉన్న సిబ్బందిని ఆఫీసులోకి వెళ్లి పని చేసుకోవాలని చెప్పారు.
ఈ ఒక్క కేంద్రంలోనే కాదు దేవనకొండ మండలం మాదాపేరం సమీపంలోని మరో ప్రైవేటు పవన్ విద్యుత్తు కంపెనీ కార్యాలయంపైనా విరుపాక్షి అనుచరులు దాడికి దిగారు. అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆస్పరి మండలం జొహరాపురం గ్రామంలోనూ మరో సంస్థ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ మూడు చోట్ల దౌర్జాన్యానికి పాల్పడిన 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే విరుపాక్షి ఇప్పటివరకు స్పందించింది. లేదు. తమ ఎమ్మెల్యే వద్దకురాకుండానే ఎలా వ్యాపారాలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెలరేగిపోయిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. స్థానిక పోలీసులు.. జిల్లా పోలీసు యంత్రాగం ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది.