వయసు ఒక నెంబర్ మాత్రమే.. 74 ఏళ్ల బిజినెస్ మ్యాన్ సాహసం తెలిస్తే అవాక్కే
ఇంతకూ ఆయనేం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం. హ్యాండిల్ పట్టుకోకుండా 112.4కిలోమీటర్ల దూరాన్ని బైక్ నడపటమే ఆయన చేసిన సాహసం.
By: Tupaki Desk | 22 Feb 2024 4:50 AM GMTవయసు మీద పడిపోతుందని తరచూ ఫిర్యాదు చేసే వారికి.. వయసులో ఉండి ఏం చేయాలో తోచటం లేదని నిరాశతో మాట్లాడే వారికి.. మొత్తంగా ఎవరికైనా ఈ పెద్దాయన చేసిన సాహసం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే సాహసం చేశాడో వ్యాపారవేత్త. ఇప్పుడాయన పేరు మారుమోగుతోంది. ఆయన సాహసం గురించి విన్న వారందరికి ఆయనో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇంతకూ ఆయనేం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం. హ్యాండిల్ పట్టుకోకుండా 112.4కిలోమీటర్ల దూరాన్ని బైక్ నడపటమే ఆయన చేసిన సాహసం. టూవీలర్ ను హ్యాండిల్ పట్టుకోకుండా బ్యాలెన్సు చేస్తూ రైడ్ చేస్తుంటారు కొందరు. అయితే. . స్వల్ప దూరానికి చేస్తుంటారు. అయితే.. ట్రాఫిక్ కండిషన్లో.. రోడ్ల మీద ఇలాంటి విన్యాసాలు అత్యంత ప్రమాదకరం. తాజా ఎపిసోడ్ అందుకు భిన్నంగా.
పంజాబ్ కు చెందిన 74 ఏళ్ల వ్యాపారవేత్త బల్వీందర్ సింగ్ చేసిన తాజా సాహసం ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకున్నారు. హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడపాలన్న కోరిక ఆయనకు 40 ఏళ్లుగా ఉంది. కోరికను మనసులో ఉంచుకోకుండా.. దాన్ని సాధించేందుకు వీలుగా సాధన చేసేవారు. బాల్యం నుంచి ఏదైనా భిన్నంగా చేయాలని తపించే ఈ ఫరీద్ కోట్ పెద్దాయన.. 2023 నవంబరు 16న మఖూ నుంచి బఠిండా వరకు మోటార్ సైకిల్ పై 112.4 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ మొత్తం దూరాన్ని ఆయన హ్యాండిల్ పట్టుకోకుండానే బైక్ నడిపారు.
ఈ బైక్ స్టంట్ వేళలో ఆయనతో పాటు ఒక వ్యక్తి.. ఒక అంబులెన్స్ కూడా ఉంచుకున్నారు. బఠిండాలో ఒక గొయ్యి అడ్డు రావటంతో 112.4 కి.మీ. వద్ద ఆయన విన్యాసం ఆగిందని.. లేదంటే మరింత దూరం ప్రయాణించేవారని చెబుతున్నారు. భారతదేశంలో ఇంత దూరాన్ని హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడిపిన రికార్డును ఆయన తన సొంతం చేసుకున్నారు. తన తదుపరి లక్ష్యం 200కి.మీ. దూరాన్ని హ్యాండిల్ పట్టుకోకుండాబైక్ నడపటమేనని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఈ పెద్దాయన్ను అద్భుతమని అనకుండా ఉండగలమా?