Begin typing your search above and press return to search.

ముకేష్ అంబానీకి బెదిరింపులు.. 19ఏళ్ల తెలంగాణయువకుడు అరెస్ట్!

గతకొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి వస్తోన్న బెదిరింపు ఈమెయిల్స్ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Nov 2023 11:01 AM GMT
ముకేష్  అంబానీకి బెదిరింపులు.. 19ఏళ్ల తెలంగాణయువకుడు అరెస్ట్!
X

గతకొన్ని రోజులుగా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి వస్తోన్న బెదిరింపు ఈమెయిల్స్ పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రూ. 20 కోట్లు ఇవ్వాలని ఒకసారి, రూ.200 కోట్లు ఇవ్వాలై మరోసారి, రు. 400 కోట్లు ఇవ్వాలని మరోసారి ఈ మెయిల్స్ లో బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు!

అవును... ముకేష్ అంబానీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఈ కేసును విచారించిన గాందేవి పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిందితుడిని గణేష్ రమేష్ వనపర్థిగా గుర్తించారు. అతడిని నవంబర్ 8వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి తరలించారు.

ఈ విషయాలపై స్పందించిన ముంబై సీనియర్ పోలీస్ అధికారి... ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా భావిస్తున్నట్లు తెలిపారని తెలుస్తుంది. అయితే ఈ బెదిరింపులపై మాత్రం మరింత లొతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

కాగా... ముకేష్ అంబానీకి తొలుత అక్టోబర్‌ 27న ఓ మెయిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేష్ అంబానీని అంతమొందిస్తామని నిందితుడు పేర్కొన్నాడు. తమవద్ద షార్ప్ షూటర్స్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మరో రెండు సందర్భాల్లోనూ ఈ తరహా మెయిల్స్‌ వచ్చాయి. తొలుత రూ.20 కోట్లు ఇవ్వాలని పేర్కొన్న నిందితుడు.. ఆ మొత్తాన్ని, రూ.200 కోట్లకు, తర్వాత రూ.400 కోట్లకు పెంచుకుంటూపోయాడు.

దీంతో... ముకేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ ఛార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబయి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతేడాది సైతం ఇలానే అంబానీని, ఆయన కుటుంబాన్ని అంతమొందిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హాస్పిటల్‌ కు ఫోన్‌ చేసి బెదిరించారు.

ఈ క్రమంలోనే తాజాగా ముంబై పోలీసులు తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ముఖేష్ అంబానీపై బెదిరింపులకు దిగింది ఇతడే అని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఈ నెల 8 వరకూ ఆ యువకుడికి రిమాండ్ విధించింది.