భూకంపాలకు కాళేశ్వరం ఓ కారణం... శాస్త్రవేత్త ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సమయంలో ఈ భూకంపాలపై శాస్త్రవేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 4 Dec 2024 11:08 AM GMTతెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7:27 గంటల ప్రాంతంలో పలు చోట్ల భూమి కంపించింది. తెలంగాణలోని ములుగులో 5.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈ సమయంలో ఈ భూకంపాలపై శాస్త్రవేత్తలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం పలుచోట్ల భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఏపీలోనూ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అయితే... తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా సంభవించిన భూకంపాల్లో ప్రతీ ఏటా దాదాపు ఒకే ప్రాంతంలో.. ములుగు చుట్టుపక్కల భూమి కంపించడాన్ని గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు.
కాకపోతే గత మూడేళ్లుగా వచ్చిన భూకంపాలతో పోలిస్తే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఎక్కువని పేర్కొన్నారు. ఇందులో భాగంగా.. 2021లో గడ్చిరోలి సమీపంలో 4.0 తీవ్రతతో భూమి కంపించగా.. 2022లో 3.8, 2023లో భద్రాద్రిలో 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. తాజాగా భూకంప తీవ్ర 5.3గా నమోదైంది!
పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదు!:
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం అలజడి సృష్టించిన భూ ప్రకంపనలపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్.జీ.ఆర్.ఐ.) రిటైర్డ్ శాస్త్రవేత్త పూర్ణచంద్ర రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం లేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
అయితే.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంలోనూ భూకంపాలు సంభవించాయని.. ప్రధానంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భూమి లోపల పగుళ్లు ఏర్పడతాయని.. వాటి సర్ధుబాటు వల్ల అప్పుడప్పుడూ భూకంపాలు వస్తాయని అన్నారు.
తాజాగా సంభవించిన భూకంపంలో ప్రధాన కంపనం పూర్తయ్యిందని.. దీనితో పాటు ఇంకా చిన్న చిన్న కంపాలు వస్తే రావొచ్చని అన్నారు. అయితే... తాజాగా సంభవించిన 5.3 తీవ్రతవల్ల పెద్దగా డ్యామేజీ కాదనే తాను భావిస్తున్నట్లు తెలిపారు.
గతంలోనూ వరంగల్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల్లో గతంలోనూ భూకంపాలు వచ్చాయని.. వీటిలో భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో సంభవించిందే పెద్ద భూకంపమని అన్నారు. 1967లో ఒంగోలు లో కూడా వచ్చిందని.. వాటి తర్వాత తాజాగా సంభవించిందే పెద్దదని తెలిపారు.
భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టూ ఓ కారణం!:
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సైతం ఓ కారణం అని సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ స్టోర్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి, ఇటువంటివి సంభవిస్తాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతం మొత్తం డిజాస్టర్ కు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
ఈ విషయాన్ని కేంద్రం సైతం వెల్లడించిందని చెబుతున్నారని చెప్పిన సుబ్బారావు... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమిలో నీరు బాగా పెరిగిందని.. ఎప్పుడైతే భూమిలో నీరు పెరుగుతుందో.. అప్పుడు భూమిలోపల ఫలకాల మధ్య కదలికలు తేలిక అవుతాయని.. ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.