Begin typing your search above and press return to search.

జనసేన రాష్ట్ర కార్యదర్శిగా పవన్ నిర్మాత!

తాజాగా బీవీఎస్ఎన్ ప్రసాద్ కు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా (కార్యక్రమ నిర్వహణ కమిటీ) నియమించారని తెలుస్తుంది. ఈ మేరకు జనసేన ట్విట్టర్ లో పవన్ కల్యాణ్… ప్రసాద్ కు నియామక పత్రాన్ని ఇస్తున్నట్లున్న ఫోటోను పోస్ట్ చేసింది!

By:  Tanoj   |   17 July 2023 7:37 AM GMT
జనసేన రాష్ట్ర కార్యదర్శిగా పవన్  నిర్మాత!
X

పవన్ సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన "అత్తరింటికి దారేది" సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కు జనసేనలో కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది. ఈ మేరకు ఆయనను జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమించారని తెలుస్తుంది. దీంతో కీలక చర్చ తెరపైకి వచ్చింది.

అవును... నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో అధికారికంగా చేరిన సంగతి తెలిసిందే. అయితే గతంలో పేమెంట్ సమస్యలకు సంబంధించి ప్రసాద్‌ పై పవన్ కేసు పెట్టారని కథనాలొచ్చాయి. అయితే సాంప్రదాయబద్ధంగా నిర్మాత ప్రసాద్ ను పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడంతో వీరిమధ్య విభేదాలు పరిష్కారమైపోయినట్లున్నాయనే చర్చ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... తాజాగా బీవీఎస్ఎన్ ప్రసాద్ కు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా (కార్యక్రమ నిర్వహణ కమిటీ) నియమించారని తెలుస్తుంది. ఈ మేరకు జనసేన ట్విట్టర్ లో పవన్ కల్యాణ్… ప్రసాద్ కు నియామక పత్రాన్ని ఇస్తున్నట్లున్న ఫోటోను పోస్ట్ చేసింది!

దీంతో జనసేన రాజకీయాల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ కీలక పాత్ర పోషించబోతున్నాట్లే అని అంటున్నారు పరిశీలకులు. ఏదో నిర్మాతగా పవన్ కు తోడుగా ఉండటం కోసం మాత్రమే పార్టీలో చేరలేదు.. కాస్త కీలకంగా ఆలోచించే కండువా కప్పుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... బీవీఎస్ఎన్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో జనసేన టిక్కెట్‌ పై పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోటీకి ప్రసాద్ ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో... నిడదవోలు, ఉంగుటూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కానీ, ఏలూరు లోక్‌ సభ నుంచి కానీ పోటీ చేయడానికి ప్రసాద్ ఆసక్తి కనబరచే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అదే వాస్తవమైతే ప్రొడ్యూసర్ ప్రసాద్ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

ఇదే సమయంలో... ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ ఛార్జ్ లను ప్రకటించారు పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆన్ లైన్ లో ఈ విషయాన్ని వెళ్లడించారు. ఇందులో భాగంగా... పిఠాపురం నియోజకవగానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టి.వి.రామారావు ను నియమించినట్లు తెలిపారు!