Begin typing your search above and press return to search.

ఆ ముఖ్యమంత్రులకు అగ్నిపరీక్ష !

ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

By:  Tupaki Desk   |   11 July 2024 10:30 AM GMT
ఆ ముఖ్యమంత్రులకు అగ్నిపరీక్ష !
X

రాజకీయం, ఎన్నికలు అనేవి నిరంతర ప్రక్రియ. ఏదో ఒక కారణంతో దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతుండడం మన దేశంలో సర్వ సాధారణం. ఇటీవలే దేశంలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఆ వెంటనే ఏడు రాష్ట్రాలలోని 13 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఓ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ వారి పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే వారి పదవులు పదిలంగా ఉంటాయన్న సంకేతాలే దీనికి కారణం.

మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డేహ్రా, హమీర్‌పూర్, నాలాగఢ్, బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్డా, మాణిక్‌తలా, తమిళనాడులోని విక్రవండి, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళౌర్, బిహార్‌లోని రూపౌలి శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన శీతల్ అంగురాల్‌ లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి జలంధర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ చేతిలో ఓటమి పాలయ్యాడు. పార్టీ మారిన నేపథ్యంలో శీతల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. శీతల్ అంగురల్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జలంధర్ పశ్చిమ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన సుశీల్ రింకుపై 4253 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. తాజాగా అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా శీతల్ పోటీ చేశాడు. ఆప్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో మోహిందర్ భగత్‌ ను ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ బరిలోకి దించి ప్రతిష్టాత్మకంగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ స్థానం గెలుచుకోవడం భగవంత్ సింగ్ మాన్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఢిల్లీ తర్వాత ఆప్ పార్టీ అధికారం అందుకున్న రాష్ట్రాలలో పంజాబ్ రెండోది కావడం గమనార్హం.

హిమాచల్ ప్రదేశ్ లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్ (డెహ్రా), ఆశిష్ శర్మ (హామీర్‌పూర్, కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్)లు ఈ ఏడాది మార్చిలో రాజీనామాలు చేసి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. వీరు ముగ్గురూ తాజాగా బీజేపీ టికెట్లపై అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ ఎన్నికల్లో డెహ్రా శాసనసభ స్థానం నుండి తన సతీమణి కమలేశ్ ఠాకూర్ నుండి బరిలోకి దించడంతో ఫలితాల మీద ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తగినంత బలం ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలవడం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ కు తలవంపులు తెచ్చింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో తన భార్యను నిలబెట్టిన నేపథ్యంలో ఆమెను గెలిపించుకోవడంతో పాటు, ఆయన సొంత జిల్లాలో హమీర్ పూర్ స్థానానికి జరిగిన ఎన్నికను కూడా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో అపజయం ఎదురైతే మరోసారి సుఖ్వీందర్ అసమర్దత బట్టబయలు అవుతుంది.