Begin typing your search above and press return to search.

'బైరెడ్డి అంటే సిద్ధార్థ్ రెడ్డి కాదు నేను'... శబరి హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వంలో కేసులు, అరెస్టుల గురించి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు

By:  Tupaki Desk   |   15 March 2025 4:00 PM IST
బైరెడ్డి అంటే సిద్ధార్థ్  రెడ్డి కాదు నేను... శబరి హాట్  కామెంట్స్!
X

వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తాజాగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కేసులు, అరెస్టుల గురించి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. ఈ సందర్భంగా బైరెడ్డి అంటే సిద్ధార్థ్ రెడ్డి కాదు నేనే అంటూ శబరి హాట్ కామెంట్స్ చేశారు.

అవును... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తాము ఏమి అభివృద్ధి చేశామో చర్చించడానికి తాను సిద్ధమని.. మరి, సిద్ధార్థ రెడ్డి కూడా సిద్ధమేనా అని శబరి సవాల్ విసిరారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రావడం లేదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వాస్తవానికి ఇప్పుడు కేసులు, అరెస్టుల గురించి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నారని.. కానీ.. అక్క అని చూడకుండా తనపై కేసులు పెట్టించారని.. మా కార్యకర్తలపై దాడులు చేయించారని.. ఏనాడూ బయటకు రాని మా అమ్మపైనా వ్యక్తిగత విమర్శలు చేశారని.. తల్లి, చెల్లి విషయంలో జగన్ ఏమి చేశారో.. ఇక్కడా అదే చేశారని ఎంపీ శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్ధార్థ రెడ్డికి కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు లేదని.. తొమ్మిది నెలలుగా అతడు ఎక్కడికి వెళ్లారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా... జగన్ మళ్లీ రావాలని అంటున్న సిద్ధార్థ రెడ్డి... కల్తీ మద్యం, గంజాయి మళ్లీ రావడం కోసం జగన్ రావాలనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ సందర్భంగా... సిద్ధార్థ రెడ్డిపై సెటైర్లు వేశారు శబరి.

ఇందులో భాగంగా... సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని.. సినిమాల్లో ట్రై చేసుకుంటే చాలా బెటరని ఉచిత సలహా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలోని "ఆడుదాం ఆంధ్ర"లో అవినీతి బయటకు వస్తుందని.. శిక్ష తప్పదని శబరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో స్కూలు పిల్లలకు సైతం డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని ఆమె ఫైరయ్యారు.

ఈ సందర్భంగా కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని ఎంపీ శబరి పరామర్శించారు. ఈ సందర్భంగా... భావోద్వేగంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.