ఉదయం టీడీపీకి వార్నింగ్.. సాయంత్రం వైసీపీలో పదవి
మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాల్లో ఒకటైన నేతల నోటి దురుసును ఇప్పటికీ అదుపు చేయడం లేదన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు.
By: Tupaki Desk | 27 March 2025 8:23 AMటీడీపీని తిట్టు.. పదవిని పట్టు.. ప్రస్తుతం వైసీపీలో ఇదే ట్రెండ్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని చాలా మంది విడిచిపెడుతున్నారు. మరికొంత మంది పార్టీలో పదవులను వదులుకుని తెరచాటు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన వైసీపీ అధిష్టానం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాల్లో ఒకటైన నేతల నోటి దురుసును ఇప్పటికీ అదుపు చేయడం లేదన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. దీనికి తాజా ఉదాహకరణగా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని చూపుతున్నారు.
యూట్యూబ్ చానళ్లకు ఇంటర్య్వూలిస్తూ తనదైన శైలిలో మాట్లాడే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. దీంతో ఆయనను ఆగమేఘాల మీద వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఆకస్మాత్తుగా సిద్ధార్థ్ రెడ్డికి పదవిని ఇవ్వడానికి ప్రధాన కారణం ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు గట్టి వార్నింగ్ ఇవ్వడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన రోజే భైరెడ్డికి యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం చూస్తే వైసీపీ తీరు ఇంకా మారలేదనే చర్చ జరుగుతోంది.
క్షేత్రస్థాయిలో ఏ బలం ఉందోగానీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మాత్రం యూట్యూబ్ ఇంటర్వ్యూలతో బాగా పాపులర్ అయ్యారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీని గెలిపించుకోవడంలో విఫలమైన బైరెడ్డి.. ప్రస్తుతం టీడీపీకి వార్నింగులిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో ఎవరూ ఇలాంటి ధోరణి ప్రదర్శించకపోవడంతో బైరెడ్డిని హీరోలా వైసీపీ భావిస్తోందని అంటున్నారు. దీంతో ఆయనకు కీలక పదవిని అప్పగించి మరింత గట్టిగా మాట్లాడమని ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘‘టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా నాలుగేళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుంది. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తోక ఊపే టీడీపీ నాయకుల సంగతి చూస్తా’’ అంటూ ఇటీవల బైరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత జగన్ తమను అదుపు చేయొద్దని, టీడీపీ నేతల విషయంలో స్వేచ్ఛనివ్వాలని కోరారు. వాస్తవానికి వైసీపీలో ఈ తరహా బెదిరింపులు, వ్యాఖ్యలు కొత్త కాదు. కానీ, అలాంటి వ్యాఖ్యలే పార్టీకి నష్టం చేశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఓటమికి దారితీసిన ఈ తరహా వ్యాఖ్యలు ఉండకూడదని దిగువస్థాయిలో కార్యకర్తలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం కేడర్ లో ధైర్యం నూరిపోసేందుకు ఆ మాత్రం గట్టిగా మాట్లాడే నేతలే కావాలంటూ బైరెడ్డి వంటివారిని ప్రోత్సహిస్తోందని అంటున్నారు.