Begin typing your search above and press return to search.

వైసీపీ యువ నేతకు వరుస దెబ్బలు!

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ యువ నేతకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 5:40 AM GMT
వైసీపీ యువ నేతకు వరుస దెబ్బలు!
X

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఈ వైసీపీ యువనేత చాలా చిన్న వయసులోనే తనకంటూ యువతలో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ను సృష్టించుకున్నాడు. ఎమ్మెల్యే, ఎంపీ కాకున్నా వైసీపీలో పేరున్న నేతగా ఎదిగాడు. ఈ ఆకర్షణే అతడికి జగన్‌ ప్రభుత్వ హయాంలో శాప్‌ (ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ) చైర్మన్‌ పదవిని దక్కేలా చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ యువ నేతకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు.

కాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. దీంతో ఆ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి చక్రం తిప్పారు. 2019లో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఐజయ్యను కాదని తొగురు ఆర్థర్‌ కు బైరెడ్డి టికెట్‌ ఇప్పించుకున్నారు. అంతేకాకుండా గెలిపించుకుని జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. దీంతో కొంత ఆలస్యంగానైనా రాష్ట్ర స్థాయిలో శాప్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు. అంతేకాకుండా వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగానూ ఎంపికయ్యారు. ఐదేళ్లూ నందికొట్కూరులో ఆయన చెప్పినవారికే పదవులు, పోస్టింగులు దక్కాయి.

అయితే 2024లో బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి హవాకు బ్రేకు పడింది. తొగురు ఆర్థర్‌ తో విభేదాలతో కొత్త అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలని బైరెడ్డి కోరారు. అయితే జగన్‌ ఆయన చెప్పిన అభ్యర్థికి కాకుండా వైఎస్సార్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ దారా సుధీర్‌ కు నందికొట్కూరు టికెట్‌ ఇచ్చారు. అయినప్పటికీ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి ఆయన గెలుపునకు కృషి చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి జయసూర్య చేతిలో సుధీర్‌ ఓడిపోయారు. దీంతో ఐదేళ్లపాటు వైసీపీ ఇంచార్జిగా చక్రం తిప్పిన బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి హవాకు బ్రేకులు పడ్డాయి.

అంతేకాకుండా నందికొట్కూరు మున్సిపాలిటీ ఇప్పటిదాకా వైసీపీ చేతిలో ఉంది. గత ఎన్నికల్లో మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపల్‌ చైర్మన్‌ సు«ధాకర్‌ రెడ్డితోపాటు 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులు టీడీపీలో చేరిపోయారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే, నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి బైరెడ్డి రాజశేఖరరెడ్డి చక్రం తిప్పారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎవరో కాదు సిద్థార్థ్‌ రెడ్డికి స్వయానా బాబాయ్‌. రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి.. నంద్యాల టీడీపీ ఎంపీగా ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రచారానికి ఆహ్వానించారు. యువతలో ఆయనకు ఉన్న క్రేజును వాడుకోవాలని చూశారు. బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి కూడా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు.

అయితే ఇప్పుడు తన సొంత వూరు అయిన నందికొట్కూరులోనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేకపోవడం ఆయనకు మైనస్‌ గా మారింది. ఇది చాలదన్నట్టు.. పుండు మీద కారం చల్లినట్టు ఏకంగా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్, 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులు పార్టీని వీడి వెళ్లిపోవడం బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డికి పెద్ద దెబ్బగా మారిందని అంటున్నారు.