ఇలాంటి వారికి టీటీడీలోమంచి పోస్టు ఇవ్వండి చంద్రబాబు
అధ్యాత్మికత నిండుగా ఉన్న వారికి టీటీడీలో కీలక స్థానాలకు ఎంపిక చేస్తే.. సాదాసీదా భక్తులకు పెద్దపీట వేయటంతో పాటు.. గతి తప్పిన టీటీడీ దారికి వస్తుందన్న సూచనలు లేకపోలేదు.
By: Tupaki Desk | 4 Feb 2025 7:46 AM GMTప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయంగా తిరుమల శ్రీవారి ఆలయం గురించి తెలిసిందే. అలాంటి ఈ దేవస్థానం పాలనా వ్యవహారాల్ని చూసే టీటీడీ మీద పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉంటాయి. సంపన్నులు.. సెలబ్రిటీలు.. రాజకీయనేతలు.. పదవుల్లో ఉన్న వారికి ఇచ్చే ప్రాధాన్యత సాదాసీదా ప్రజలను పట్టించుకోరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికితోడు బోలెడన్ని విమర్శలు.. ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. టీటీడీ బోర్డుకు సంబంధించిన ఎంపిక మొత్తం రాజకీయ ప్రేరేపితంగానే ఉంటాయి తప్పించి.. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా కనిపించవు. ఇలాంటి తీరుకు ఎక్కడో ఒక దగ్గర చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది.
అధ్యాత్మికత నిండుగా ఉన్న వారికి టీటీడీలో కీలక స్థానాలకు ఎంపిక చేస్తే.. సాదాసీదా భక్తులకు పెద్దపీట వేయటంతో పాటు.. గతి తప్పిన టీటీడీ దారికి వస్తుందన్న సూచనలు లేకపోలేదు. మరెలాంటి వారిని ఎంపిక చేయాలి? అన్న ప్రశ్నకు తాజాగా ఒక ఉదాహరణను చెప్పే అవకాశం దక్కింది. భారత్ తో సహా పలు దేశాల్లో విపత్తులు.. స్పందన విభాగంలో సేవలు అందించిన ఒక మహిళ స్వామివారికి అరవీర భయంకర భక్తురాలు సి.మోహన.
తన ఉద్యోగ జీవితంలో పొదుపు చేసిన మొత్తాన్ని తీసుకొచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకగా సమర్పించేందుకు తిరుమల వచ్చారు. తన ఉద్యోగ జీవితంలో ఆమె అల్బేనియా.. యెమెన్.. సౌదీ అరేబియా తదితర దేశాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆమె ఎక్కడ పని చేసినా గోవిందుని నామస్మరణ చేయటం మర్చిపోలేదు. అంతేకాదు.. ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా పొదుపు చేస్తూండేవారు.
ఆ సొమ్ము మొత్తాన్ని శ్రీవారికి ఇవ్వాలని భావించారు. ఇందుకు తగ్గట్లే రూ.50 లక్షల భారీ మొత్తాన్ని సోమవారం టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని కలిసి డీడీ ఇచ్చారు. తాను ఇచ్చిన పొదుపు మొత్తాన్ని టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకునే అనాథ.. పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. సి.మోహన స్వగ్రామం రేణిగుంట. చిన్నతనం నుంచి స్వామి వారంటే వల్లమాలిన అభిమానం. ఇలాంటి భక్తజనుల్లో కొందరిని టీటీడీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పజెబితే.. మార్పు దానంతట అదే రాకుండా ఉంటుందా? ఆ దిశగా పాలకులు ఎందుకు ఆలోచించరు?అన్నది ప్రశ్న.