మంత్రివర్గ భేటీలో సంచలన నిర్ణయాలేనట !
అంతే కాదు భూ కబ్జాదారులకు కఠిన దండన ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Nov 2024 10:30 PM GMTఏపీలో తెలుగుదేశం కూటమి మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద గత అయిదేళ్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్న భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో దాని మీద తొలిసారి సీరియస్ గా ఈ భేటీలో చర్చిస్తారు అని అంటున్నారు.
అంతే కాదు భూ కబ్జాదారులకు కఠిన దండన ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దాంతో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982 రిపీల్ బిల్లు గురించే ఈ సమావేశంలో చర్చిస్తారు అని అంటున్నారు. పాత చట్టంలో ఉన్న కొన్ని క్లాజుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో దాని వల్ల కేసులకు కూడా ఇబ్బందులు వస్తున్న క్రమంలో దానిని మార్చి కొత్త చట్టం తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే గత అయిదేళ్ల వైసీపీ పాలనలో అన్యాక్రాంతం అయిన భూములు కబ్జాలకు గురి అయిన భూముల విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందని అంటున్నారు. ఏకంగా లక్ష ఎకరాల భూములు కబ్జాకు గురి అయ్యాయని కూడా భావిస్తున్నారుట. దాంతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 స్థానంలో సరికొత్తగా పదునైన చట్టాన్ని తీసుకుని రావాలని కూడా మంత్రివర్గం తీర్మానిస్తుందని అంటున్నారు.
ఇక ఇదే కేబినెట్ భేటీలో బీసీలకు పెద్ద పీట వేయాలని కూడా నిర్ణయించనున్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సమావేశంలో చర్చిని ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అలాగే ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచుతూ మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అంతే కాదు ఒలింపిక్స్ లో ఏపీకి చెందిన క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా వారికి బహుమతులు కూడా పెంచేందుకు చూస్తున్నారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం కనుక సాధిస్తే వారికి ఇచ్చే నజరానాను ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు పెంచుతారు అని అంటున్నారు. దాని మీద కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.
అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దాంతో ఆ ప్లాంట్ కి అవసరం అయిన భూకేటాయింపులు చేసే అంశంపైన కూడా ఈ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
అదే విధంగా వైసెపీ అధినాయకత్వానికి చెందిన సరస్వతి పవర్ ప్లాంట్ భూముల విషయంలోనూ కేబినెట్ లో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేప్పారు. కాబట్టి దాని మీద చర్చ సాగే అవకాశం ఉంది. ఇక లా అండ్ ఆర్డర్ మీద పవన్ పిఠాపురం సభలో తాజాగా చేసిన కామెంట్స్ ని చూస్తే కనుక ఆ అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ సాగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి భూ కబ్జాకోర్లకు షాక్ ఇచ్చేల కఠిన చట్టాన్ని తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గం రెడీ అవుతోంది అని అంటున్నారు.