మంత్రి లేని తెలంగాణ రాజధాని.. ఈసారీ క్యాబినెట్ లో చోటులేదా?
తాజాగా క్యాబినెట్ విస్తరణ ముందుకువచ్చింది. మొత్తం ఆరు ఖాళీలకు గాను నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని కథనాలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 25 March 2025 12:27 PM ISTపదేళ్ల కేసీఆర్ పాలన ముగిసి.. ప్రజా ప్రభుత్వం పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి దాదాపు ఏదాదిన్నర అవుతోంది. ఇప్పటికే పావు వంతు టర్మ్ ముగిసింది అని ప్రతిపక్షాల నుంచి సెటైర్ లు వస్తున్నాయి. జమిలి ఎన్నికలు రాకుంటే మిగిలింది మూడున్నరేళ్లే. జమిలి వస్తే మరో అంతకుముందే టర్మ్ ముగుస్తుందని చెబుతున్నారు.
ఇప్పటికీ తెలంగాణకు హోం మంత్రి లేరు. అత్యంత కీలక ఈ శాఖను నేరుగా ముఖ్యమంత్రే చూస్తున్నారు. తాజాగా క్యాబినెట్ విస్తరణ ముందుకువచ్చింది. మొత్తం ఆరు ఖాళీలకు గాను నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాతినిధ్యం లభించబోతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి నారాయణపేట ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రిగా చాన్స్ దొరుకుతుందని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికీ అమాత్య యోగం పట్టనుందని చెబుతున్నారు.
మరి హైదరాబాద్ కు...?
తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద నగరం.. దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు తెలంగాణ మంత్రివర్గంలో మాత్రం చోటు లేకుండాపోతోంది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో కోర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా నెగ్గలేదు. దీంతో ఖైరతాబాద్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు అయిన దానం నాగేందర్ ను ఆకర్షించింది. కానీ, తాజా మంత్రివర్గం విస్తరణలో దానంతో పాటు హైదరాబాద్ నుంచి ఎవరికీ చాన్స్ లేనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలె యాదయ్య (చేవెళ్ల)లకూ చాన్స్ లేనట్లే అంటున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేశ్ గెలుపొందినా ఈయన పూర్తిగా కొత్తవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా తెలంగాణ మంత్రివర్గంలో ప్రతినిధ్యం లేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్ రెడ్డి (పరిగి), మనోహర్ రెడ్డి (తాండూర్)లకూ ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కడం లేదని పేర్కొంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని అత్యంత కీలకమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రి లేకుండానే తెలంగాణ మంత్రివర్గం మరికొన్నాళ్లు కొనసాగనుందన్నమాట.