Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఆస్పత్రులు ఇంత అధ్వానమా? కేజ్రీ సర్కార్ ను కడిగిపారేసిన కాగ్!

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   28 Feb 2025 5:00 PM IST
ఢిల్లీ ఆస్పత్రులు ఇంత అధ్వానమా?  కేజ్రీ సర్కార్ ను కడిగిపారేసిన కాగ్!
X

దేశ రాజధాని ఢిల్లీలో వైద్య, ఆరోగ్య విధానం దేశంలోనే ఎక్కడా లేదంటూ, ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన వైద్యసదుపాయాలు ఉచితంగా అందిస్తున్నామని గత ఆప్ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఆరోగ్య విధానంలో ఢిల్లీ మోడల్ ను మిగతా రాష్ట్రాలు అనుసరించాలని కూడా కేజ్రీవాల్ సెలవిచ్చేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్య, వైద్యంపైనే కేజ్రీ పార్టీ ఫోకస్ చేసి ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ఆరోగ్య విధానం డొల్ల అని, అక్కడి ఆస్పత్రులు పరమ అధ్వానమని కాగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆప్ పార్టీ చేసిందంతా అబద్ధపు ప్రచారమని తేల్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ నివేదికను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ఆరోగ్య భద్రతతో పాటు మౌలిక వసతుల కల్పనలో గత ఆప్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ఢిల్లీలోని 14 ఆస్పత్రుల్లో ఐసీయూలే లేవని తెలిపింది. ఆప్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్ ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని వివరించింది. ఈ ఆస్పత్రుల్లో కనీసం టాయిలెట్లు కూడా లేవని స్పష్టం చేసింది. ఆరేండ్లుగా ఢిల్లీ సర్కార్ వైద్య, ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందంటూ వెల్లడించింది. వైద్య పరికరాలు, ఆరోగ్య సంరక్షణ కార్మికుల తీవ్రమైన కొరత, మొహల్లా క్లినిక్ లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, అత్యవసర నిధుల వినియోగం తక్కువగా ఉందని చెప్పింది.

ఢిల్లీ మహానగర వ్యాప్తంగా 27 ఆస్పత్రులు ఉండగా..అందులో 14 ఆస్పత్రుల్లో ఐసీయూలు లేవని, 16 దవాఖానాల్లో బ్లడ్ బ్యాంకులు లేవని, 8 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని పేర్కొంది. మరో 15 ఆస్పత్రుల్లో మార్చురీ సదుపాయం లేదని, 12 ఆస్పత్రులకు కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదని వెల్లడించింది. ఆప్ ప్రభుత్వం గొప్పలకు పోయి చెప్పుకున్న మొహల్లా క్లినిక్ లలో సరైన సదుపాయాలే లేవని చెప్పింది.

2023 నాటికి 1000 క్లినిక్ లను ఏర్పాటు చేస్తామని చెప్పిన కేజ్రీ ప్రభుత్వం అందులో సగం మాత్రమే ఏర్పాటు చేసిందని కాగ్ తూర్పార బట్టింది. పూర్తి చేసిన వాటిలో సైతం సరైన సదుపాయాలు లేవంది. ఆయుష్ డిస్పెన్సరీల్లో మందులు కూడా అందుబాటులో లేవని తెలిపింది. ఇక ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. కొన్ని ఆస్పత్రుల్లో 21 శాతం నర్సుల కొరత ఉందని, 38శాతం పారామెడిక్స్, 50 నుంచి 96 శాతం డాక్టర్లు, నర్సుల కొరత ఉందని చెప్పింది. కరోనా చికిత్స కోసం కేటాయించిన రూ.787.91 కోట్లలో రూ.582.84 కోట్లు మాత్రమే ఉపయోగించారని, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కేటాయించిన రూ.3.52 కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిపోయాయని పేర్కొంది. ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 32వేల కొత్త ఆస్పత్రి పడకల్లో కేవలం 1357(4.24) మాత్రమే నిర్మించినట్లు కాగ్ కడిగేపారేసింది. కొన్ని ఆస్పత్రుల ఆక్యుపెన్సీ రేటు 101 శాతం నుంచి 189 శాతంగా నమోదైందని, దీంతో రోజుల తరబడి పేషెంట్లు నేలపైనే చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని తేల్చింది.

కాగ్ నివేదిక ద్వారా ఆప్ సర్కార్ చేసిన ప్రచారం అంతా అబద్ధమేనని తేలిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అవినీతి ప్రభుత్వం కాబట్టే ప్రజలు వారిని ఓడించి ఇంటికి సాగనంపారని ఎద్దేవా చేస్తున్నాయి. హామీల అమలులో నిర్లక్ష్యం, అక్రమాలతో ఆ పార్టీని ప్రజలు ఛీకొట్టారని ఆరోపిస్తున్నాయి.