కాగ్ రిపోర్ట్: పంచాయతీలు-ప్రాజెక్టులే వైసీపీని ముంచాయా?
దీనిలో పలు విషయాలు వెల్లడించినా.. కీలకమైన రెండు విషయాలు ఆసక్తిగా ఉన్నాయి.
By: Tupaki Desk | 13 Nov 2024 6:00 PM GMTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నిట్టనిలువునా మునిగిపోవడానికి గ్రామీణ ప్రాంతాలు.. అభి వృద్ది ప్రాజెక్టులే కీలకంగా వ్యవహరించి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం గత వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలు, చేసిన అప్పులు, ఖర్చులు వంటివాటికి సంబంధించిన స్వతంత్ర వ్యవస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. దీనిలో పలు విషయాలు వెల్లడించినా.. కీలకమైన రెండు విషయాలు ఆసక్తిగా ఉన్నాయి.
1) గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా వైసీపీ విస్మరించడం. 2) మూల ధన వ్యయం చేయకపోవడం. గ్రామీణ ప్రాంతాలైన పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వైసీపీ ప్రభుత్వం నిధులు విదల్చలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఉదాహరణకు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం 9 నుంచి 10 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొందని పేర్కొంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పడలేదని స్పష్టం చేసింది.
ఈ ప్రభావం ఇటీవల ఎన్నికలపై పడి ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం లేదని, కేంద్రం ఇచ్చిన వాటిని కూడా వైసీపీ ప్రభుత్వం వాడేసుకుందని పంచాయతీ ప్రెసెడెంట్లు, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక, రెండో విషయానికి వస్తే.. మూల ధన వ్యయం. ఇది కూడా రూ.100 కేటాయించాల్సిన చోట.. రూ.9 నుంచి 10 మాత్రమే ఖర్చు చేసినట్టు కాగ్ విస్పష్టంగా వివరించింది.
వాస్తవానికి ఏ రాష్ట్రానికైనా మూల ధన వ్యయం అత్యంత కీలకం. ఇది పెట్టుబడులను తీసుకురావడంతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా అందిస్తుంది. అందుకే.. మెజారిటీ రాష్ట్రాలు మూతల ధన వ్యయానికి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే.. ఇటీవల కాలంలో కేంద్రం నుంచి నిధుల రాక తగ్గి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిన దరిమిలా మూల ధన వ్యయం తగ్గుతూ వచ్చింది. అయితే.. మరీ ఇంత దారుణంగా .. జగన్ హయాంలో రూ.9-10 మాత్రమే కేటాయించినట్టు కాగ్ తెలిపింది.
ఈ పరిణామాలు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపించాయని అందుకే మధ్యతరగతి పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయిందని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత వైసీపీ కంటే ఒక పావల ఎక్కువగానే మూల ధన వ్యయానికి కేటాయించడం గమనార్హం. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మూల ధన వ్యయం 34,341 కోట్ల రూపాయలుగా చూపించింది.