Begin typing your search above and press return to search.

వార్డు సచివాలయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు

ఇవన్నీ ఒక ఎత్తు.. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:45 AM GMT
వార్డు సచివాలయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
X

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో సిద్ధం చేసిన గ్రామ సచివాలయాలు ఎంతలా విజయం సాధించాయో తెలిసిందే. గ్రామస్థాయిలో ప్రజలకు అవసరమైన సేవల్ని అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థ సూపర్ హిట్ కావటమే కాదు.. ప్రజల ఆదరణను దోచుకుంది. గతంలో చిన్న పనులకు పెద్ద ఎత్తున శ్రమ పడాల్సి వచ్చేది. ఎప్పుడైతే గ్రామ సచివాలయాలు ఏర్పాటు అయ్యాయో.. అప్పటి నుంచి చాలా పనులు సులువుగా మారాయి. అయితే.. గ్రామ సచివాలయాల మీద పలు ఆరోపణలు.. విమర్శలు ఉండటం తెలిసిందే.

ఇవన్నీ ఒక ఎత్తు.. తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొంది. వార్డు సచివాలయాల వ్యవస్థ 74వ రాజ్యాంగ సవరణ చట్టం.. ఏపీ పురపాలక చట్టాల్లోని నిబంధనల్ని నీరుగార్చేలా ఉందని పేర్కొంది. స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బ తీయటమేనని స్పష్టం చేసింది.

వార్డు స్థాయిలో సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యనిర్వాహణ వ్యవస్థ అనీ.. అందులోని కార్యదర్శులు.. నగరపాలక కమిషనర్ ద్వారా ఎన్నికై పాలక వర్గానికి బాధ్యత వహిస్తారని చెప్పే అభిప్రాయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కాగ్ తేల్చేసింది. వార్డు కమిటీలు.. ప్రాంతీయ సభల్లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్లు.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. పౌర సమాజ సభ్యుల భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది.

రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఏపీ పురపాలక చట్టాలు చేసినా.. వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్న కాగ్.. "ఎన్నికైన ప్రజాప్రతినిదులు.. ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేయటం.. పాలనను వారికి చేరువ చేయటం స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యం. ఆ ప్రయోజనాల్ని వార్డు సచివాలయ వ్యవస్థ దెబ్బ తీస్తుంది" అని పేర్కొన్నారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం వార్డు కమిటీలను ఏర్పాటును పక్కన పెట్టి వాటికి బదులుగా ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టటాన్ని తప్పు పట్టింది.

ఒక్కో వార్డు సచివాలయానికి పది మంది వార్డు కార్యదర్శుల చొప్పున 3876 సచివాలయాల్లో 37,860 మంది కార్యదర్శులతో పాటు పనితీరు ఆధారిత గౌరవ వేతకం కింద 70,888 మంది వాలంటీర్లను నియమించటం.. వారి కోసం 2019నుంచి 21 రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1191 కోట్లు ఖర్చు చేయటాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని 243ఎస్ అధికరణం ప్రకారం వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి.

ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం.. 1994లోని సెక్షన్ 10తో పాటు.. ఏపీ పురపాలక మండలి నియమాలు, 1995 నియమం 3 ప్రకారం కూడా అన్ని పట్టణ.. స్థానిక సంస్థలూ వార్డు కమిటీలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామ సచివాలయ వ్యవస్థలో పౌర భాగస్వామ్యం కొరవడినట్లుగా పేర్కొన్న కాగ్.. స్వపరిపాలన సాధించటానికి వీలుగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు.. కీలక సూచన చేసింది. స్వపరిపాలన సాధించటానికి వీలుగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయటం.. వార్డు కమిటీలు.. ప్రాంతీయ సభలకు బాధ్యత వహించేలా వార్డు సచివాలయాన్ని అనుసంధానం చేయాలని చెప్పింది. మరి.. కాగ్ చెప్పినట్లే ఏపీ సర్కారు చేస్తుందో లేదో చూడాలి.