Begin typing your search above and press return to search.

'నిప్పంటించిన న్యూ ఇయర్ వేడుకలు'..అందుకే అమెరికాలో కార్చిచ్చు?

ప్రపంచంలో ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు పక్కకుపోయాయి.. అమెరికా కార్చిచ్చు ప్రధాన అంశంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   13 Jan 2025 8:30 PM GMT
నిప్పంటించిన న్యూ ఇయర్ వేడుకలు..అందుకే అమెరికాలో కార్చిచ్చు?
X

ప్రపంచంలో ఇప్పుడు ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు పక్కకుపోయాయి.. అమెరికా కార్చిచ్చు ప్రధాన అంశంగా మారిపోయింది. దాదాపు వారం రోజులుగా రగులుతూనే ఉంది ఆ దావానలం. ఎంతకూ అదుపులోకి రావడం లేదు. ఒకవేళ చిన్నాచితకా దేశాల్లో ఇలా జరిగి ఉంటే పరిస్థితి ఏమో కానీ.. అమెరికాలో కావడంతో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు.

ఖరీదైన నగరంగా చెప్పుకొనే లాస్‌ ఏంజెలెస్‌ ఇప్పుడు కార్చిచ్చు బారిన పడి మండిపోతోంది. ఇదిలాగే కొనసాగితే బూడిదగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, ఓ మాదిరి బుష్ ఫైర్ లను సమర్థంగా అణచివేసే అమెరికాలో ఇలా జరగడానికి కారణం ఏమిటి..?

లాస్ ఏంజెలెస్ మంటల్లో కొన్ని చిన్నవాటిని అదుపు చేసినా.. పాలి సేడ్స్‌, ఏటోన్‌ ప్రాంతాల్లో మంటలు తగ్గడం లేదు. ఇప్పటివరకు 24 మంది చనిపోయారు. పాలిసేడ్స్‌ లో 23,707, ఏటోన్‌ లో 14,117, కెన్నెత్‌ లో 1,052, హుర్సెట్‌ లో 779 ఎకరాలు కాలిపోయాయి. 12 వేల నిర్మాణాలు ఆహుతయ్యాయి. 160 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కాలిబూడిదైంది.

కాగా, ఈ కార్చిచ్చులకు కొత్త ఏడాది వేడుకలే కారణం అనే ప్రచారం మొదలైంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉత్సాహంగా కాల్చిన బాణసంచానే దావానలానికి కారణమైందని అంటున్నారు.

లాస్‌ ఏంజెలెస్‌లో అతిపెద్దది పాలిసేడ్స్‌ ఫైర్‌ కు కారణం న్యూ ఇయర్‌ వేడుకలని అనుమానిస్తున్నారు. టపాసులతో అంటుకొన్న దానిని ఆర్పినా.. మిగిలిన నిప్పునకు బలమైన గాలులు తోడై కార్చిచ్చుగా మారింది. శాటిలైట్ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులతో మాట్లాడి.. పాలి సేడ్స్ ఫైర్‌ ఇక్కడే మొదలైందని తేల్చారు.

పాలిసేడ్స్ సంపన్న ప్రాంతం. కార్చిచ్చుతో ప్రజలు విలువైన వస్తువులను వదిలేసి ఇళ్లు ఖాళీ చేశారు. దీంతో దొంగలకు పండుగే అవుతోంది. ఇలాంటివారు 29 మందిని అరెస్టు చేశారు. ఖాళీ ఇళ్లను కాపాడేందుకు 400 మంది నేషనల్ గార్డ్స్‌ ను నియమించడం గమనార్హం.

పైన వివరాల ప్రకారం చూస్తే లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు 13 రోజుల కిందటనే మొదలైందని తెలుస్తోంది. మరెన్ని రోజులకు పూర్తిగా అదుపులోకి వస్తుందో?