Begin typing your search above and press return to search.

హైటెక్‌ సిటీలో నకిలీ కాల్‌ సెంటర్‌....అమెరికన్లను టార్గెట్‌ చేసుకొని భారీగా మోసాలు....60 మంది అరెస్ట్!

హైటెక్‌ సిటీలో నిర్వహిస్తున్న ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా వారు అమెరికన్లను టార్గెట్‌ చేసుకొని భారీగా మోసాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2025 6:19 PM IST
హైటెక్‌ సిటీలో నకిలీ కాల్‌ సెంటర్‌....అమెరికన్లను టార్గెట్‌ చేసుకొని భారీగా మోసాలు....60 మంది అరెస్ట్!
X

నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన మనస్విని సహా మొత్తం 60 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైటెక్‌ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా వారు అమెరికన్లను టార్గెట్‌ చేసుకొని భారీగా మోసాలు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుల ప్రధాన సూత్రధారి మనస్విని తన సహచరులు కైవాన్‌ పటేల్‌, ప్రతీక్‌, రాహుల్‌లతో కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురిని టెలీకాలర్లుగా నియమించుకొని అమెరికన్లను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హ్యాక్‌ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామని నమ్మించి, బాధితుల బ్యాంకు ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలను సేకరించి భారీగా డబ్బు కాజేస్తున్నారు.

- పోలీసుల దాడులు

సమాచారం అందుకున్న సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హైటెక్‌ సిటీ ప్రాంతంలో దాడి చేసి, మొత్తం 60 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ దాడుల్లో 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్‌ఫోన్లు, మోసానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తరహా మోసాల నుంచి తప్పించుకోవాలంటే అనామక ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా ఉండటం మంచిది. బ్యాంకు సంబంధిత వివరాలను ఎవరికీ చెప్పకూడదు. నకిలీ కాల్‌ సెంటర్ల బాధితులుగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ కేసును సంబంధిత అధికారులు విచారిస్తుండగా, ఇంకా ముఠాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.