Begin typing your search above and press return to search.

బాత్ రూమ్ లో కెమెరాలు ఇష్యూ... సున్నితత్వం కోల్పోతున్నామా?

గురువారం రాత్రి కొంతమంది అమ్మాయిలు.. బాత్ రూమ్ లో కెమెరాలు గమనించారని.. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలంటూ అర్ధరాత్రి వారంతా నిరసనలు చేశారు!

By:  Tupaki Desk   |   30 Aug 2024 5:06 PM GMT
బాత్  రూమ్  లో కెమెరాలు ఇష్యూ... సున్నితత్వం కోల్పోతున్నామా?
X

గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో రహస్య కెమెరాను గుర్తించారనే వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి కొంతమంది అమ్మాయిలు.. బాత్ రూమ్ లో కెమెరాలు గమనించారని.. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలంటూ అర్ధరాత్రి వారంతా నిరసనలు చేశారు!

దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర సంచలనం అయ్యింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు, కథనాలు, ఊహాగాణాలు వెరసి తీవ్ర కలకలం రేపాయి! సహజంగానే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది! ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు మొదలైపోయాయి!

అసలు అక్కడ ఏమి జరిగింది..? జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత శాతం ఉంది..? ఆ సంఘటనకు సంబంధించి చెబుతున్నట్లు వీడియోలతో వ్యాపారం చేశారనే ఆరోపణల్లో నిజం ఎంత..? అనే విషయాలపై కనీస పునరాలోచన లేకుండా... ఎవరి స్థాయిలో వాళ్లు చిలువలు పలువలు చేసి ప్రచారం చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో.. ఆ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లల తల్లితండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెబుతున్నారు. ఏ వార్త నమ్మాలి, ఏ కథనాన్ని విశ్వసించాలి అనే విషయంలో తల్లితండ్రులు పూర్తి స్పష్టతను కోల్పోయారనే చర్చా తెరపైకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అయితే... అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లుగా ఉంది!

కారణం... ఇప్పటివరకూ ఈ ఘటనకు సంబంధించి వినిపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చె ఏ ఒక్క సరైన ఆధారం కూడా వెలుగులోకి రాలేదని అంటున్నారు. ఇంత సున్నితమైన అంశంపై అటు మీడియా కానీ, ఇటు సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ వీలైనంత సంయమనం పాటించాలని పలువురు కోరుతున్నారు.

ఇది కాలేజీకి ఎంత డ్యామేజ్, మేనేజ్మెంట్ కు ఎంత ఇబ్బంది అనే అంశాలను పక్కనపెట్టి, ప్రధానంగా ఎంతో మంది అమ్మాయిల జీవితాలకు, వారి వారి కుటుంబాల గౌరవాలకు సంబంధించిన విషయం అనే సృహ అందరికీ ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మరోపక్క ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు నిజంగా ఏమైనా ఉంటే... వాటి విషయంలో అత్యంత గోప్యతను డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క ఈ విషయంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. విచారణకు ఆదేశించింది. ఘటన విషయం తెలిసిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను కాలేజీకి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు సంబంధించి ప్రతీ 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో... ప్రభుత్వ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా అందేవరకూ ఎవరూ వీటిపై ఊహాగాణాలు ప్రసారం, ప్రచారం చేయకూడదని సూచిస్తున్నారు. ఈ ఘటన అసత్యమైతే బాగుండు అని కోరుకుంటున్నారు!