ప్రచారానికి క్లైమాక్స్ ఫిక్స్... లాస్ట్ ఫైట్ ఎలా ఉండబోతుందంటే...?
అవును... ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది.
By: Tupaki Desk | 10 May 2024 6:19 AM GMTకీలక సమయం వచ్చేసింది. ఇంకో రెండు రోజులు ఆగితే పోలింగ్ మొదలైపోబోతోంది! ఇప్పటికే నగదు పంపిణీ కార్యక్రమం మొదలైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది. అదే.. ప్రచారానికి డెడ్ లైన్ సమయం! దీంతో చివరిగా మిగిలి ఉన్న ఈ సమయాన్ని నేతలు, పార్టీల అధినేతలు ఎలా వినియోగించుకోబోతున్నారు.. ఎలాంటి కీలక సభలు నిర్వహించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
అవును... ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. మైకులు మూగబోనున్నాయి.. ప్రచార రథాలు నిలిచిపోనున్నాయి.. తడారిపోయిన నేతల గొంతులకు విశ్రాంతి దొరకనుంది! ఈ సమయంలో ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని పార్టీల అధినేతలు ఎంత కీలకంగా వినియోగించుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
ఈ సందర్భంగా పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఆల్ మోస్ట్ 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లోనూ "సిద్ధామా..?" అని అడుగుతున్నాను అంటూ జగన్ హోరెత్తించేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రచార గడువుకు సమయం దగ్గరపడుతున్న వేళ శుక్రవారం... నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, ఆర్కే రోజా బరిలోకి దిగిన నగరితో పాటు తన సొంత జిల్లా కడపలో జగన్ ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో ప్రధానంగా ప్రచార గడువుకు చివరి రోజైన శనివారం నాడు వైసీపీ అధినేత జగన్.. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు! ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ ఫైట్ అక్కడ ఫిక్స్ చేశారు జగన్!
ఇదే సమయంలో... అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేష్.. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా... పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గంగా మారిన ఉండితో పాటు ఏలూరు, కృష్ణాజిల్లా గన్నవరం, పల్నాడు జిల్లా మాచర్ల, ప్రకాశం జిల్లా ఒంగోలుల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు చంద్రబాబు. దీంతో... క్లైమాక్స్ ప్రచారాలు డబుల్ ఇంపాక్ట్ తో హోరెత్తిపోబోతున్నాయని అంటున్నారు!
ఇక్కడ మరో ఆసక్తికర విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా... తన తమ్ముడు పవన్ కల్యాణ్ ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ వీడియో బైట్ వదిలిన చిరంజీవి... శనివారం నేరుగా పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉందని ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. చివరి నిమిషం.. పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత కీలక సమయం అని కూడా చెప్పొచ్చు.. అలాంటి సమయంలో మెగా ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.