భారత్ వెళ్లాలంటే నాలుగు గంటల ముందు రావాల్సిందే.. కెనడాలో ప్రత్యేక నిబంధనలు
దాంతో ఇక్కడ వారి దౌత్యవేత్తలను పంపించడమే కాకుండా.. భారత్ దౌత్యవేత్తలను ఇండియాకు రప్పించారు.
By: Tupaki Desk | 19 Nov 2024 11:30 AM GMTఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్-కెనడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ హత్యతతో భారత్ ఏజెంట్లకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలను భారత్ కూడా సీరియస్‌గా తీసుకుంది. దాంతో ఇక్కడ వారి దౌత్యవేత్తలను పంపించడమే కాకుండా.. భారత్ దౌత్యవేత్తలను ఇండియాకు రప్పించారు.
దీనిపై కెనడా ప్రధాని స్పందించి.. తాను కేవలం నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే భారత్‌పై ఆరోపణలు చేశానని అన్నారు. తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ.. భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కెనడియన్ గడ్డపై సిక్కు వేర్పాటువాది హత్యతో లింకు పెట్టడంతో అగ్రశ్రేణి దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని చెప్పొచ్చు.
ఈ క్రమంలో కెనడా నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు కెనడా అదనపు భద్రతా తనిఖీలు చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ అదనపు భద్రతా చర్యలను అమల్లోకి తీసుకొచ్చినట్లు కెనడా రవాణాశాఖ మంత్రి అనిత్ ఆనంద్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భారత్‌కు ప్రయాణించే వారిలో అదనపు భద్రతా తనిఖీలు పెంచినట్లు తెలిపారు. ఈ తనిఖీలతో భారత్ వెళ్లాలనుకునే ప్రయాణికులు 4 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్ కెనడా కూడా ప్రకటన చేసింది.
అయితే.. కెనడా విమానశాఖ ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రధాన కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి 19వ తేదీల మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయవద్దని ఖలిస్థానీ వేర్పాటువాడి గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని పన్నూ హెచ్చరించాడు. అందుకే ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణాలు చేయవద్దని ఓ వీడియో రిలీజ్ చేశాడు.