Begin typing your search above and press return to search.

ట్రూడోనే కాదు..కెనడా మీడియాకూ భారత్ పై ద్వేషమే..

ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనడా ఒకప్పుడు ప్రశాంతతకు మారు పేరు. క్రైం రేట్ కూడా చాలా తక్కువ. ఏ నిరసనలు జరిగినా శాంతియుతంగానే సాగేవి.

By:  Tupaki Desk   |   3 Dec 2024 11:08 AM GMT
ట్రూడోనే కాదు..కెనడా మీడియాకూ భారత్ పై ద్వేషమే..
X

ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనడా ఒకప్పుడు ప్రశాంతతకు మారు పేరు. క్రైం రేట్ కూడా చాలా తక్కువ. ఏ నిరసనలు జరిగినా శాంతియుతంగానే సాగేవి. అలాంటి దేశంలో ఇటీవల కాలంలో పరిస్థితులు కాస్త అదుపుతప్పాయి. మితిమిరీన భావస్వేచ్ఛ ఇబ్బందులకు దారితీస్తున్నదా? అనే అభిప్రాయం వచ్చింది. ఇక కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారత్ అంటే ద్వేషం. దీన్ని ఆయన చర్యల ద్వారా చాటుకున్నారు. మరోవైపు కెనడా రెండు నెలల కిందట ఖలిస్థానీ ఉగ్రవాదం విషయంలో భారత్ పై చేసిన ఆరోపణలు ఎంతటి దుమారం రేపాయో అందరూ చూశారు. ఆ తర్వాత ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఎన్నడూ లేని స్థాయికి పడిపోయాయి. రాయబారుల బహిష్కరణ వంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వీటికి పీక్ అన్నట్లుగా భారత హోం మంత్రి అమిత్ షాపై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది.

తరచూ వార్తల్లో..

కెనడా-భారత్ సంబంధాలు తరచూ మీడియాలో వస్తున్నాయి. ఆ దేశంలో ఏ పరిణామం జరిగినా భారతీయులు ప్రభావితం అవుతారు. ఎందుకంటే.. కెనడాలో ఉంటున్నవారిలో రెండో అత్యధిక సంతతి భారతీయులే కాబట్టి. ఆఖరికి ఇటీవల కెనడాలో పార్ట్ టైం ఉద్యోగాలకు యువకులు బారులు తీరిన ఉదంతంలోనూ భారతీయులు ఉన్నారు.

రాజకీయ పార్టీ ఎన్నికల్లో జోక్యం..

రాజకీయ ద్వేషమే కాక.. ఇప్పుడు కెనడా మీడియా వంతు వచ్చింది. కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ కథనం ప్రచురితమైంది. ఈ పార్టీ కెనడాలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఒకవేళ ట్రూడో ఓడిపోతే అధికారంలోకి వచ్చేది వీరే. అలాంటి పార్టీ నాయకత్వ ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నదంటూ కెనడా ప్రభుత్వ మీడియా సంస్థ సీబీఎస్‌ కథనం ప్రచురించింది. అయితే, కన్జర్వేటివ్ పార్టీ ఖండించడం గమనార్హం.

రెండేళ్ల కిందటి గతం తవ్వుతూ

కెనడా ప్రభుత్వ మీడియా ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలు రెండేళ్ల కిందట జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలకు సంబంధించినవి కావడం గమనార్హం. 2022లో కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నదంటూ ఆరోపిస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ నాయకడు పాట్రిక్‌ బ్రౌన్‌ అభ్యర్థిత్వాన్ని దెబ్బతీసేందుకు భారత ఏజెంట్లు యత్నించారని పేర్కొంది. భారత కాన్సులేట్‌ ప్రతినిధులు బ్రౌన్‌ ప్రచార బృందం చైర్మన్‌ మిషెల్‌ రెంపర్‌ గార్నర్‌ ను తప్పుకోవాలని కోరినట్లు సీబీసీ ఆరోపించింది. 2022 జూన్‌ లో గార్నర్ ను పదవి నుంచి అందుకే తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుత పార్టీ అధినేత పియర్రె పొయిలీవ్రే చాలా సౌకర్యంగా ఎన్నికల తొలి రౌండ్‌ లో నెగ్గినట్లు వెల్లడించింది.

ఖండించిన గార్నర్

సీబీసీ కథనాన్ని గార్నర్‌ ఖండించారు. బ్రౌన్‌ ప్రచార బృందం నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నట్లు తెలిపారు. మంత్రిగా పనిచేసిన తాను, సీనియర్ పార్లమెంటు సభ్యురాలినైన తనపై ఇలాంటి కథనాలను రావడం హాస్యాస్పదం అన్నారు.

చిత్రం ఏమంటే బ్రౌన్‌ కూడా సీబీఎస్‌ కథనాన్ని తోసిపుచ్చారు. ‘ఇలాంటివి ఆధారాలు లేని కథనాలు’’ అని పేర్కొన్నారు. కెనడాలో భారత్‌ జోక్యంపై ఏర్పాటుచేసిన హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ స్టాండిగ్‌ కమిటీ ఎదుట హాజరుకావాలని బ్రౌన్‌ కు ఇటీవల సమన్లు వచ్చాయి. రాజకీయ కారణాలతో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీ ప్రతినిధి స్పందిస్తూ.. నాయకత్వ ఎన్నికల్లో విదేశీయుల జోక్యంపై తమకు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (సీఎస్‌ఐఎస్‌) సమాచారం ఇవ్వలేదన్నారు.

కాగా, కెడనా ప్రధాని ట్రూడో ప్రతిపక్ష నేత కంటే 20శాతం ఓట్లు వెనుకబడి ఉన్నారు. ఇలాంటి సమయంలో సీబీసీ ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం.