Begin typing your search above and press return to search.

అమిత్ షా పేరును మేమే లీక్ చేశాం.. కెనడా మంత్రి బరితెగింపు!

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు కారణమైన ఒక మంత్రి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   31 Oct 2024 6:05 AM GMT
అమిత్ షా పేరును మేమే లీక్ చేశాం.. కెనడా మంత్రి బరితెగింపు!
X

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు కారణమైన ఒక మంత్రి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిన దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. తాను చేసిన ఎదవ పని గురించి సమర్థించుకుంటూ చెప్పుకొచ్చిన వైనం చూస్తే.. ఎంత బలుపు అన్న భావన కలుగక మానదు. తన కారణంగా తమ దేశానికి మరో దేశానికి మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయన్న ఇంగితం లేకుండా వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే.. తాను చేసిన తప్పుడు పనిని సమర్థించుకోవటం మరోపని.

కెనడా పౌరుల్ని బెదిరించేందుకు.. చంపేందుకు భారత ప్రభుత్వంలోని ఒక సీనియర్ మంత్రి (అమిత్ షా) ఆమోదం తెలిపినట్లుగా అమెరికన్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం వెనుక తాను ఉన్న విషయాన్ని కెనడా మంత్రి ఒకరుతాజాగా ఒప్పుకోవటం గమనార్హం. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్. తాజాగా ఆ దేశ పౌర రక్షణ.. జాతీయ భద్రతా కమిటీ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా భారత హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికన్ మీడియాకు షేర్ చేసుకున్నట్లు ఒప్పుకున్నారు.

కెనడా ఎన్నికల్లో భారత ఏజెంట్ల జోక్యం.. నేర కార్యకలాపాలపై ‘పౌర రక్షణ.. జాతీయ భద్రతా స్టాండింగ్ కమిటీ’ విచారణ చేపట్టింది. ఇందులో కమిటీ వైస్ ఛైర్ పర్సన్ గా కన్జర్వేటివ్ ఎంపీ రాక్వెల్ డాంచో కెనడాలో భద్రతపై అధికారుల్ని ప్రశ్నించారు. గత ఏడాది జూన్ లో 45 ఏళ్ల హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కాల్చి చంపిన అంశంలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపించటం తెలిసిందే. ఇదిలా ఉండగా..కెనడాలో జరిగిన నిజ్జర్ హత్యకు సంబంధించి అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టుకు కెనడా ప్రభుత్వం నుంచి ఎవరు సమాచారం అందించారు? అంటూ కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలియా డ్రెయిన్ ను రాక్వెల్ డాంచో ప్రశ్నించారు.

కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్లుగా వాష్టింగ్టన్ పోస్టు రాసిన కథనం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆ జర్నలిస్టుకు ఎవరు షేర్ చేశారన్న ప్రశ్నకు బదులిచ్చిన కెనడా విదేశాంగ డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్.. తానే ఆ సమాచారాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.

తనకు సదరు జర్నలిస్టు ఫోన్ చేశారని.. దీంతో ఆయనకు తాను సమాచారం ఇచ్చినట్లుగా ఒప్పుకున్నారు. ఆ ఘటన గురించి సదరు జర్నలిస్టు అప్పటికే చాలా రాశారని.. అతనికి చాలా చోట్ల నుంచి సమాచారం వస్తుందన్న ఆయన.. ఆ సమాచారాన్ని ధ్రువీకరించాలని కోరారని.. తాను ధ్రువీకరించినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా వెలుగు చూసిన పరిణామాలపై భారత ప్రభుత్వంఇంకా స్పందించలేదు.

అయితే.. కెనడా చేసిన ఆరోపణల్ని అర్థం లేనివిగా కొట్టిపారేయటం తెలిసిందే. నిజ్జర్ హత్య వార్తను వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైనప్పుడు స్పందించిన భారత విదేశాంగ శాఖ.. ఈ కథనం ఒక తీవ్రమైన అంశంపై అన్యాయమైన.. నిరాధారమైన ఆరోపణలు చేసిందని మండిపడింది. తాజాగా కెనడా మంత్రి ఒకరు యూఎస్ మీడియా సంస్థకు లీకు ఇచ్చిన వైనాన్ని ఒప్పుకోవటం చూస్తే.. తన నోటి మాట ద్వారా తమ దేశానికి.. భారత్ కు మధ్య దూరం పెరగటంతో పాటు.. కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరించటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది. మరి.. దీనిపై మోడీ సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.