కెనడా కొత్త ప్రధాని ప్రమాణం... ట్రంప్ కు షాకిచ్చే ప్రతిజ్ఞ!
ఈ సమయంలో తాజాగా కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ (59) ప్రమాణ స్వీకారం చేశారు.
By: Tupaki Desk | 15 March 2025 12:30 AM ISTకెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అటు ప్రధానమంత్రి పదవితో పాటు, ఇటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన వేళ.. కెనడా 24వ ప్రధాని ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో తాజాగా కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ (59) ప్రమాణ స్వీకారం చేశారు.
అవును... అమెరికాతో వాణిజ్య యుద్ధం, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి 51వ రాష్ట్రంగా విలీన ముప్పు, త్వరలో ఫెడరల్ ఎన్నికలు వంటి సవాళ్ల మధ్య కెనడా నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించారు. కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
వాస్తవానికి కెనడా ప్రధాన మంత్రిగా జస్టిన్ ట్రూడో స్థానాన్ని భర్తీ చేసే రేసు విషయంలో చాలా మంది పేర్లే తెరపైకి వచ్చాయి. ఇందులో పలువురు భారత సంతతి నేతల పేర్లు చర్చకు వచ్చాయి! అయితే.. ఈ రేసులో ఫైనల్ గా మార్క్ కార్నీ విజయం సాధించారు. ఈ సందర్భంగా ట్రంప్ విషయంలో ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... మార్క్ కార్నీ తన ప్రసంగంలో ట్రంప్ పై మాటల దాడి చేశారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నారని.. హాకీ ఆటలో గెలిచినట్లే వాణిజ్యంలోనూ కెనడానే గెలుస్తుందని.. అమెరికన్లు దీనిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని.. ట్రంప్ పై కెనడా గెలుస్తుందని ప్రతిజ్ఞ చేశారు.
ఎవరీ మార్క్ కార్నీ?:
1965లో ఫోర్ట్ స్మిత్ లో జన్మించిన మార్క్ కార్నీ.. హార్వర్డ్ లో ఉన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలో... గోల్డ్ మన్ శాక్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన... అనంతరం, బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లకు గవర్నర్ గా పనిచేశారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ను వీడిన అనంతరం.. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు.
ఈ క్రమంలో తాజాగా.. లిబరల్ పార్టీ నాయకత్వ పోటీలో ప్రత్యర్థులను భారీ మెజారిటీతో ఓడించారు. ఇందులో భాగంగా.. ఆదివారం జరిగిన పార్టీ నాయకత్వం ఎన్నికల్లో 85.9 శాతం ఓట్లతో తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ను కార్నీ ఓడించారు. కాగా... ఆయన ఇప్పటివరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు.