Begin typing your search above and press return to search.

కెనడాలో కొత్త రూల్.. మన పిల్లలకు ఆర్థిక కష్టాలే

కెనడాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులకు చేదు కబురు చెప్పింది అక్కడి ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:30 AM GMT
కెనడాలో కొత్త రూల్.. మన పిల్లలకు ఆర్థిక కష్టాలే
X

కెనడాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులకు చేదు కబురు చెప్పింది అక్కడి ప్రభుత్వం. తాజాగా తీసుకొచ్చిన నిబంధనతో ఆర్థికకష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే దుస్థితి. ఇప్పటివరకు ఓవైపు చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం జాబులు చేసే వారిపై పరిమితులు విధిస్తూ తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా మన పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. ఇకపై వారం మొత్తంలో కేవలం 24 గంటలు మాత్రమే బయట పని చేసేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించింది కెనడా సర్కార్.

కొవిడ్ వేళలో చిరు ఉద్యోగుల సంక్షోభాన్ని అధిగమించేందుకు కెనడా ప్రభుత్వం అప్పట్లో పని గంటల మీద మినహాయింపు ఇచ్చింది. గతంలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే పని చేసే వీలుండేది. దానికి మినహాయింపులు ఇస్తూ.. వారంలో 20 గంటల కంటే ఎక్కువ పని చేసే వీలుండేది. దీంతో..వారు ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ తమ ఖర్చులకు తగిన మొత్తాన్ని సంపాదించుకునేవారు. తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించేవారు.

తాజాగా 20 గంటలకు మించి పని చేసే సౌలభ్యాన్ని తీసివేశారు. దాని స్థానే వారంలో కేవలం 24 గంటలు మాత్రమే పని చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వారం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్ మన విద్యార్థుల ఆర్థిక అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. 2022లో కెనడాకు 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు వెళ్లగా.. అందులో మన విద్యార్థులే 2.26 లక్షలు కావటం గమనార్హం. విద్యార్థి వీసాల మీద ప్రస్తుతం కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఏకంగా 3.2 లక్షల మందిగా చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ఇంత మంది మీదా పడనుంది.

ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలతో కెనడాలో చదువుకునే విదేశీ విద్యార్థుల చేతికి వచ్చే మొత్తాలు.. నెలసరి వారి ఖర్చుల్ని వారే సంపాదించుకునే పరిస్థితి ఉండేది. అక్కడి నిబంధనల పరకారం ఒకేసారి డ్యూటీ గరిష్ఠంగా 8 గంటలు మాత్రమే. అంతే.. కొత్త నిబంధన ప్రకారం లక్షలాదిగా ఉన్న మన భారతీయ విద్యార్థులు వారంలో కేవలం 3 రోజులు మాత్రమే పని చేసే వీలుంది. ఇప్పుడు తెచ్చిన రూల్ ప్రకారం గంటకు 17.36 కెనడియన్ డాలర్లను (మన రూపాయిల్లో ఒక కెనడియన్ డాలర్ రూ.62.16) కనీస వేతనంగా చెల్లిస్తారు. ఇంత తక్కువ ఆదాయంతో కెనడాలో ఖరీదైన జీవితాన్ని కొనసాగించటం కష్టమవుతుందని చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇప్పటివరకు ఒకరిద్దరితో కలిసి ఉన్న విద్యార్థులు ఎక్కువ మందితో ఇంటి షేరింగ్ లాంటి ఖర్చుల్నితగ్గించే కార్యక్రమంలోకి వెళుతున్నారు. మొత్తంగా కెనడాలో చదివే మన పిల్లల మీద భారీ భారం పడేలా తాజా రూల్ ఉందని చెప్పాలి.