కెనడా.. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే!
తమ దేశ పౌరుడు, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ పెద్ద కలకలమే రేపారు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
By: Tupaki Desk | 20 Oct 2023 9:50 AM GMTతమ దేశ పౌరుడు, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ పెద్ద కలకలమే రేపారు.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. అంతేకాకుండా ఇందుకు ప్రతిగా కెనడాలోని భారత దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించారు. మరోవైపు తన మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు భారత్ పైన ఫిర్యాదులు చేశారు. తమ దర్యాప్తుకు భారత్ సహకరించాలని ఆ దేశంపై ఒత్తిడి తేవాలని జస్టిన్ ట్రూడో తన మిత్ర దేశాలను కోరారు.
కెనడా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా భారత్ లో ఉంటున్న 66 మంది కెనడా దౌత్య సిబ్బందిలో 41 మందిని తొలగించాలని.. లేకపోతే వారికి దౌత్యపరమైన రక్షణను, భద్రతలను తొలగిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా కెనడాకు వీసాల జారీని నిలిపేసింది. కెనడాలో ఉన్న భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని కూడా జారీ చేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామమని.. ఈ నేపథ్యంలో భారతీయులు జాగ్రత్తగా ఆ దేశంలో సంచరించాలని సూచించింది.
దీంతో దిగివచ్చిన జస్టిన్ ట్రూడో తాము భారత్ తో ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని కొద్దిరోజుల క్రితం చెప్పారు. అయితే భారత్ తమ దర్యాప్తుకు సహకరించాలని కోరారు. దీంతో భారత్ - కెనడా ఉద్రిక్తతలు సడలినట్టేనని అంతా భావించారు. అయితే ఇంతలోనే భారత్ లో తమ పౌరులు జాగ్త్రతగా ఉండాలని సూచనలు జారీ చేసింది. తద్వారా మరోసారి భారత్ ను కవ్వించే చర్యలకు పాల్పడింది.
భారత్ ఆల్టిమేటంతో కెనడా తన దౌత్య సిబ్బందిని మనదేశంలో తగ్గించుకుంది. వారిని ఇతర దేశాలకు తరలించింది. ఈ నేపథ్యంలో కెనడా వ్యతిరేక చర్యలకు భారత్ లో ఆస్కారముందని ఆ దేశం తన పౌరులకు సూచించింది. భారత్ లో కెనడా వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు జరిగే ప్రమాదముందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కెనడా పౌరులకు సూచించింది.
కెనడియన్లపై బెదిరింపులకు పాల్పడటంతోపాటు వేధించొచ్చని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని కోరింది. బెంగళూరు, చండీగఢ్, ముంబైల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని తన దేశ పౌరులకు సూచించింది.
భారత్ లో పెద్ద నగరాల్లో విదేశీయులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కొందరు చోరీలకు పాల్పడుతుంటారని కెనడా ప్రభుత్వం తమ పౌరులకు తెలిపింది. అందువల్ల రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఇక, దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకోవడంతో బెంగళూరు, ముంబయి, చండీగఢ్ నగరాల్లో అన్ని రకాల ఇన్–పర్సన్ సేవలను నిలిపివేస్తున్నట్లు కెనడా తెలిపింది. దీంతో ఈ నగరాల్లో వ్యక్తిగత వీసా, కాన్సులర్ సేవలు అందుబాటులో ఉండవంది. ఈ ప్రాంతాల్లోని కెనడియన్లు ఏదైనా అవసరమైతే ఢిల్లీలోని కెనడా హై కమిషన్ ను సంప్రదించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కెనడా తాజా కవ్వింపులపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.