ట్రూడో మళ్లీ అవే వ్యాఖ్యలు!
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Sep 2023 5:52 AM GMTతమ దేశ పౌరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని జస్టిన్ ట్రూడో కెనడాలో భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. దీని దీటుగా బదులిచ్చిన భారత్.. మనదేశంలో ఉన్న కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం వదిలిపోవాలని ఆల్టిమేటం జారీ చేసింది. ఇందుకు ఐదు రోజుల గడువు ఇచ్చింది. అంతేకాకుండా కెనడా పౌరులకు వీసాలను కూడా నిలిపేసి షాక్ ఇచ్చింది.
మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్య వ్యవహారానికి సంబంధించి తన మిత్ర దేశాలన్నింటికీ భారత్ పై ఫిర్యాదులు చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు నిజ్జర్ హత్య వ్యవహారాన్ని వివరించి ఇండియానే ఇందుకు కారణమంటూ నిందారోపణలు చేస్తున్నారు.
కెనడాలో జరిగిన ఈ హత్యతో తమకు ఏమాత్రం సంబంధం లేదని భారత్ చెబుతున్నా వినని జస్టిన్ ట్రూడో భారత్ ప్రభుత్వ ఏజెంట్లే ఈ హత్య చేశారంటూ పదే పదే అవే ఆరోపణలను వల్లె వేస్తున్నారు. దర్యాప్తుకు భారత్ తమకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ద్వారా ఈ విషయంలో భారత్ పై ట్రూడో ఒత్తిడి తెస్తున్నారు.
భారత్ ను రెచ్చగొట్టడం లేదని, భారత్ తో ఉద్రిక్త పరిస్థితులను కోరుకోవడం లేదని అంటూనే నిజ్జర్ హత్యను ఇండియాకే ఆపాదిస్తున్నారు. కెనడా మిత్రదేశాలకు భారత్ పై ఫిర్యాదులు చేస్తున్నారు. తమతో దర్యాప్తులో పాల్గొని భారత్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని జస్టిన్ ట్రూడో డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రూడో మళ్లీ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్ కు కెనడా వెల్లడించిందని ట్రూడో వెల్లడించారు. తద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.
నిజ్జర్ హత్యకు సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని కొన్ని వారాల క్రితం తాను భారత్ కు తెలిపానని ట్రూడో వెల్లడించారు. ఈ విషయంలో తాము భారత్ తో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సీరియస్ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్ కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
ఈ అంశంపై మొదట్లో పెద్దగా స్పందించని అమెరికా.. ట్రూడో ఒత్తిడితో స్వరం పెంచుతోంది. ఇలాంటి విషయాల్లో ఎవరికీ, ఏ దేశానికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఆ దేశం తాజాగా ప్రకటించింది. కెనడా కోరినట్టు చేయాలని భారత్ కు అమెరికా సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దేశం అండ దొరకడంతో జస్టిన్ ట్రూడో రెచ్చిపోతున్నారు.
అయితే ట్రూడో బెదిరింపులకు భారత్ భయపడే పరిస్థితిలో లేదు. అమెరికా చెప్పినా, ఎవరు చెప్పినా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ ఖండిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ వెనక్కి తగ్గే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. కెనడాతో తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉంది.