Begin typing your search above and press return to search.

దేశం పరువు తీశారు: కెనడా ప్రధానికి సిటిజన్‌ షాక్‌!

వివరాల్లోకి వెళ్తే.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్నవారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 1:40 PM GMT
దేశం పరువు తీశారు: కెనడా ప్రధానికి సిటిజన్‌ షాక్‌!
X

తమ దేశంలో ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపేశారంటూ ఆరోపించి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పెద్ద కలకలమే రేపారు. అంతేకాకుండా కెనడా నుంచి భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. అంతటితో ఆగకుండా తన మిత్ర దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌ తదితర దేశాలకు భారత్‌ పై ఫిర్యాదులు చేశారు. తమ దర్యాప్తుకు భారత్‌ సహకరించేలా ఒత్తిడి తేవాలని కోరారు.

మరోవైపు కెనడా ప్రధాని ఆరోపణలపై భారత్‌ భగ్గుమంది. కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపేసింది. అంతేకాకుండా ఆ దేశానికి చెందిన సీనియర్‌ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది. తమ దేశంలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిలో 40 మందిని అక్టోబర్‌ 12లోపు వెనక్కి తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని విదేశాంగ విధానం సరిగా లేదని.. భారత్‌ తో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయనపై ఆ దేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు షాకిచ్చాడు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రూడో అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్నవారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో గుంపులో ఉన్న ఓ వ్యక్తితో ట్రూడో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా.. అతడు 'మీతో కరచాలనం చేయను' అని ట్రూడోకి షాక్‌ ఇచ్చాడు. 'మీరు దేశాన్ని నాశనం చేశారు.. దేశం పరువు తీశారు' అంటూ ట్రూడోను ఉద్దేశించి బిగ్గరగా అరిచాడు. దీంతో అతడి మాటలకు ప్రధాని జస్టిన్‌ ట్రూడో షాకయ్యారు.

ఆ తర్వాత షాక్‌ నుంచి తేరుకుని తనపై 'ఎందుకంత కోపంగా ఉన్నారు.. నేనేం చేశాను' అంటూ అతడిని ట్రూడో ప్రశ్నించారు. దీనికి ఆ వ్యక్తి స్పందిస్తూ.. "దేశంలో ఎవరైనా ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? మీరు కార్బన్‌ పన్ను కూడా విధిస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి తిరిగి ట్రూడో స్పందిస్తూ ‘కార్బన్‌ ట్యాక్స్‌తో ఏం చేస్తున్నానో మీకు తెలుసు కదా.. ఆ పన్నుల మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం' అని అతడికి సమాధానం ఇచ్చారు.

కానీ, అతడు ట్రూడో మాటలు పట్టించుకోకుండా.. 'మీరు ఆ మొత్తాన్ని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నారని' మండిపడ్డాడు. దీంతో 'మీరు పుతిన్‌ (రష్యా అధినేత) మాటలు ఎక్కువగా వింటున్నారని' చెబుతూ ట్రూడో నవ్వుతూ అక్కణ్నుంచి వెళ్లిపోయారు. సిటిజన్‌ కు, కెనడా ప్రధాని ట్రూడోకు జరిగిన ఈ సంభాషణ తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.