కెనడాలో వీసా సేవల్ని పునరుద్ధరించిన భారత్.. కండిషన్స్ అప్లై!
అవును... దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ కెనడా పౌరుల వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి ఆ సేవల్ని పునరుద్ధరించింది
By: Tupaki Desk | 26 Oct 2023 4:35 AM GMTగతకొంతకాలంగా భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో కెనడా పౌరులకు ఇటీవల భారత్ వీసా సేవల్ని నిలిపివేసింది. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా సేవల్ని పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బుధవారం ఒక ప్రకటనల విడుదల చేసింది.
అవును... దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ కెనడా పౌరుల వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో ఎంట్రీ వీసా, మెడికల్ వీసా, బిజినెస్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు స్పష్టంచేసింది.
ఇదే సమయంలో నేటి (అక్టోబర్ 26) నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని.. సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రెస్ నోట్ లో పేర్కొంది. ఇందులో భాగంగానే నాలుగు కేటగిరీల వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది.
కాగా... ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమేయం, జోక్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రత్యక్షంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య భారీ గ్యాప్ నెలకొంది. ఫలితంగా... భారత్ కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి ఇరు దేశాలు వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి!
నిజ్జర్ హత్య విషయంలో భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని.. అక్కడి మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. మన దేశంలో కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది.
అంతేకాకుండా... కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఓ అడ్వైజరీ కూడా జారీ చేసింది. అదే సమయంలో భారత్ లోని రాయబార కార్యాలయంలో సిబ్బందిని సైతం కెనడా వెనక్కి పిలిపించుకున్న పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ - కెనడా సంబంధాలు క్లిష్ట దశలో ఉన్నాయని.. భారత వ్యవహారాల్లో కెనడా దౌత్య సిబ్బంది జోక్యంపై ఆందోళన నెలకొందని.. అందుకే వారి సంఖ్య విషయంలో సమానత్వాన్ని అమలు చేయాలని కోరినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. అయితే అంతకముందు భారత్ హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా ప్రకటించిన విషయంలో... అమెరికా, యూకేలు కెనడాకు వత్తాసు పలికిన సంగతి తెలిసిందే!