గ్లోబల్ జాబ్ మార్కెట్ లో ఇండియన్స్ డామినేషన్ పెరిగిందా?
ఓ కెనడియన్ మహిళ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
By: Tupaki Desk | 8 Oct 2024 12:30 PM GMTఓ కెనడియన్ మహిళ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. నియామక పద్దతులు వివక్షతో కూడినవిగా ఉంటున్నాయని.. దానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు "టిమ్ హోర్టన్స్" నుంచి తనను తొలగించారని ఆమె ఆరోపించింది. భారతీయ వలసదారులకు సదరు కంపెనీ అనుకూలంగా ఉందని ఆమె పేర్కొంది.
అవును... కెనడియన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ అయిన టిమ్ హోర్టన్స్ లో భారతీయ మేనేజర్లు వివక్షతో కూడిన నియామక పద్ధతులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మాజీ ఉద్యోగి ఆరోపించింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట కొత్త రచ్చకు దారి తీసింది. ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో భారీ వార్ నడుస్తోంది!
ప్రస్తుతం ఈ పోస్ట్ 4.5 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో నెట్టింట హల్ చల్ చేస్తోంది. భారతీయ మేనేజర్లు ప్రత్యేకంగా భారతీయ వలసదారులనే నియమించుకున్నారని.. అన్యాయమైన పని వాతావరణాన్ని సృష్టించారని ఆ మహిళ పేర్కొంది! ఈ సంఘటన కెనడాలో ఇమ్మిగ్రేషన్ పెరుగుదల, ట్రూడో సర్కార్ కొత్త ఆంక్షల మధ్య తెరపైకి రావడం గమనార్హం!
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా.. చాలా మంది ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొంతమంది అర్హులైన వలసదారులు కూడా సముచితమైన అవకాశాలకు అర్హులంటూ స్పందించారు.
కాగా... ఇటీవల కెనడాలో డజన్ల కొద్దీ విదేశీ విద్యార్థులు.. అందులోనూ ఎక్కువగా భారతీయులు టిమ్ హోర్టన్స్ లో ఉద్యోగాలు వెతుక్కోవడానికి క్యూలో నిల్చున్నట్లున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.