ఆఖరి నిమిషంలో మారిన కాంగ్రెస్ అభ్యర్థి వీరే.. ఎందుకంటే?
ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన కొన్ని స్థానాలకు ఆఖరి నిమిషంలో పేర్లు మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 10 Nov 2023 3:53 AM GMTమిగిలిన రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు మార్చే సంప్రదాయం కాంగ్రెస్ లో ఉంటుందని.. ఏమైనా జరగొచ్చని.. బీఫారం చేతికి వచ్చి.. దాన్ని దాఖలు చేసే వరకు ఏమైనా జరగొచ్చన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే తాజాగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన కొన్ని స్థానాలకు ఆఖరి నిమిషంలో పేర్లు మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. గురువారం పొద్దుపోయిన తర్వాత చివరి జాబితా విడుదలైంది.
నామినేషన్ల దాఖలకు ఈ రోజే (శుక్రవారం) ఆఖరు. ఇలాంటి వేళలో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన వారితో పాటు.. ఇప్పటివరకు అభ్యర్థుల ప్రకటన చేయని మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మీడియాకు ప్రకటనను విడుదల చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. గురువారం రాత్రి విడుదలైన జాబితా ఐదుగురు పేర్లతో ఉంది. సూర్యాపేట.. తుంగతుర్తి.. చార్మినార్.. మిర్యాలగూడకు తాజాగా అభ్యర్థుల్ని ప్రకటించగా.. ఇప్పటికే పటాన్ చెర్వులో ప్రకటించిన నీలం మధుకు బదులుగా కాటా శ్రీనివాస్ గౌడ్ ను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ.. ఫైనల్ జాబితాను విడుదల చేశారు.
చివరి జాబితాలో సీనియర్ల ఒత్తిడికి కాంగ్రెస్ అధినాయకత్వం లొంగినట్లుగా చెబుతున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ దన్నుతోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. పటాన్ చెర్వులో అభ్యర్థిని మార్చటం వెనుక మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ముద్ర ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇప్పటికే ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ కు బదులుగా కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ను డిసైడ్ చేశారు.
చార్మినార్ స్థానం మీద చివరి వరకు సాగిన ఉత్కంట తీరిపోయింది. మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఒకవేళ ముంతాజ్ పోటీకి నో చెబితే.. మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం మస్కతీ కుమారుడు అలీ మస్కతీకి చార్మినార్ టికెట్ కేటాయించాలని భావించారు. చివర్లో తాము పోటీకి సిద్ధంగా లేమని తేల్చటంతో పీసీసీ సభ్యుడు కమ్ న్యాయవాది అయిన మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్ కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా చివరి క్షణం వరకు ఊరించి జాబితాను విడుదల చేయటం కాంగ్రెస్ కే చెల్లిందని చెప్పాలి.
ఫైనల్ జాబితాలో డిసైడ్ చేసిన అభ్యర్థులు వీరే
1. సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డి
2. తుంగతుర్తి మందుల సామేల్
3. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి
4. చార్మినార్ మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్
5. పటాన్ చెరు కాటా శ్రీనివాస్ గౌడ్