తెలంగాణ ఎన్నికల్లో.. అభ్యర్థులకు సొంత కుంపట్ల సెగ...!
ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం ఒక ఎత్తయితే.. తనకు పెద్దగా ప్రత్యర్థులు లేకుండా చూసుకోవడం నాయకులకు మరో ఎత్తు.
By: Tupaki Desk | 13 Nov 2023 5:00 AM ISTఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం ఒక ఎత్తయితే.. తనకు పెద్దగా ప్రత్యర్థులు లేకుండా చూసుకోవడం నాయకులకు మరో ఎత్తు. ఒకే వేళ ఉన్నా.. ఒకరో ఇద్దరో ఉంటే బలమైన పోటీ ఇచ్చి ఎదుర్కోవడంపైనే దృష్టి పెడతారు. ఎవరూ కూడా సొంతింట్లో కుంపటిని కోరుకోరు. అయితే.. అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరికి సొంత కుంపట్ల సెగలు తగులుతున్నాయి. వారి వారి కుంటుంబాల్లోని వారే.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోపోటీలో ఉన్న అభ్యర్థులు తల్లడిల్లుతున్నారు. ఉదాహరణకు ఆందోల్ నియోజకవర్గం నుంచి హాస్య నటుడు బాబూ మోహన్ పోటీ చేస్తున్నారు. ఈయనకు చిట్ట చివరి వరకు ఊరించి ఊరించి.. బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ, దీనికి ముందు.. ఈయన కుమారుడు ఈ టికెట్‌ను ఆశించారు. ఈ క్రమంలో నే ఆయన తన తండ్రికి వయసు అయిపోయిందని.. ఆయన వల్ల వృథానేనని, టికెట్ ఇవ్వొద్దని.. తనకు ఇస్తే గెలిచి గిప్ట్‌గా ఇస్తానని పేర్కొంటూ బీజేపీ పెద్దలతో నేరుగానే చర్చించారు.
దీంతో ఆందోల్ టికెట్‌పై నిర్ణయాన్ని చాలా రోజుల వరకు బీజేపీ పెండింగులో పెట్టింది. ఇక, చివరకు ఈ టికెట్‌ను కిషన్ రెడ్డి సూచనల మేరకు.. బాబూ మోహన్‌కే ఇచ్చింది. ఇంత వరకుబాగానే ఉన్నా.. ఇప్పుడు తెరచాటున సొంత కొడుకు చేస్తున్న వ్యతిరేక ప్రచారం బాబూ మోహన్‌కు కొరుకుడు పడడం లేదు. కార్యకర్తలను రాకుండా అడ్డుకుంటుండడం.. క్షేత్రస్థాయిలో వ్యతిరేకులకు ప్రోత్సాహం ఇవ్వడం వంటివి బాబూ మోహన్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి.
ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి బరిలో దిగిన పబ్బతిరెడ్డి విజయ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈమె సొంత అన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్‌ను తిరస్కరించింది. దీంతో ఆయన రెబల్ అయిపోయారు. వెంటనే బీఆర్ ఎస్‌తో చర్చలుకూడా జరిపారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేస్తానంటూ.. ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ విజయారెడ్డిపై పడుతోంది. నియోజకవర్గంలో విష్ణు మద్దతు దారులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ ఎస్ అభ్యర్థి దానంకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇలా.. చాలా చోట్ల అభ్యర్థులకు సొంత వారి నుంచే సెగ పుడుతుండడం గమనార్హం.