జగన్ని టీడీపీ ఇకపైన ఆ మాట అనగలదా...?
మాట్లాడితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ఆ పార్టీ సీనియర్లు, కీలక నేతలు అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు అని విమర్శించేవారు.
By: Tupaki Desk | 31 Oct 2023 4:14 PM GMTమాట్లాడితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ఆ పార్టీ సీనియర్లు, కీలక నేతలు అంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారు అని విమర్శించేవారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరు క్షణం అది అక్రమం అని పేర్కొంటూనే బాబుని జైలులో ఉంచడానికి వ్యవస్థలను మ్యాంజేజ్ చేస్తున్నారు అంటూ ప్రతీ రోజూ అదే మాట అంటూ ఉండేవారు.
ఇపుడే ఆ మాట మీద చర్చ సాగుతోంది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. 54 రోజుల పాటు ఆయన రాజమండ్రి జైలు గోడల మధ్యన ఉండిపోయారు. ఇపుడు హెల్త్ కండిషన్ మీదనే బాబుకు బెయిల్ లభించింది. దీని మీద టీడీపీ తమ్ముళ్ళు అంతా ఒక్కటే మాట మాట్లాడుతున్నారు. న్యాయం గెలిచింది అని అంటున్నారు.
అంటే తమకు అనుకూలంగా ఏదైనా వస్తే న్యాయం గెలిచినట్లు. లేకపోతే వైసీపీ వ్యవస్థలను మ్యానేజ్ చేసినట్లు. ఇదేనా టీడీపీ ద్వంద్వ నీతి అన్నది ఇపుడు చర్చ సాగుతోంది. నిజానికి చంద్రబాబుని అరెస్టు చేసింది పూర్తి ఆధారాలతో అని సీఐడీ చెబుతూ వస్తోంది. ఇక ఆయనకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.
ఆ మీదట బాబు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది కూడా గౌరవ న్యాయ స్థానాలే. ఇదిలా ఉండగా బాబు ఇన్నాళ్ళు ఎందుకు జైలులో ఉండిపోయారు అన్న దానికి జవాబు మొదట టీడీపీ వారే వెతకాల్సి ఉందని అంటున్నారు. బాబు అరెస్ట్ తరువాత బెయిల్ పిటిషన్ కి వెళ్లకుండా క్వాష్ పిటిషన్ కి వెళ్లారు. దాని వల్లనే కాలయాపన జరిగింది అని అంటున్నారు.
దాంతో పాటుగా బెయిల్ మామూలుగా అయితే బాబుకు రాకపోవచ్చు అన్న వాదనను కూడా న్యాయ నిపుణులు పలువురు లేవనెత్తారు. ఎందుకంటే కేసు అవినీతి మీద పెట్టినది, పైగా ఆధారాలు ఉన్నాయని సీఐడీ చెబుతోంది కాబట్టి. ఏజ్ పరంగా కానీ హెల్త్ గ్రౌండ్ లో కానీ పిటిషన్ వేసుకుంటే బెయిల్ వస్తుందని భావించే వారూ ఉన్నారు.
ఇపుడు బాబుకు హెల్త్ గ్రౌండ్స్ మీదనే బెయిల్ లభించింది. బాబు కంటికి ఆపరేషన్ చేసుకోవాలని తమకు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాదులు కోరడంతో మధ్యంతర బెయిల్ లభించింది. బాబు హెల్త్ ఇష్యూస్ మీదనే ఈ బెయిల్ వచ్చింది అన్నది కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక రాజ్యాంగంలోని 21 అధికరణం కూడా జీవించే స్వేచ్చకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.
ఆ విధంగా చూస్తే లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన ఆప్ మంత్రి ఒకరికి హెల్త్ గ్రౌండ్స్ లోనే బెయిల్ లభించింది అని గుర్తు చేస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో నేషనలిస్ట్ పార్టీ నేతకు ఒకరికి ఈడీ అరెస్ట్ మీద బెయిల్ కూడా మెడికల్ గ్రౌడ్స్ లోనే వచ్చిందని చెబుతున్నారు. అందువల్ల బాబుకు బెయిల్ అంటే ఆయన నిర్దోషి అన్నది కానే కాదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
అదే టైంలో బాబు కేసు అలాగే ఉంది. బెయిల్ మాత్రం వచ్చింది. ఇక రానున్న రోజుల్లో రెగ్యులర్ బెయిల్ కూడా రావచ్చు. ఎందుకంటే ఏ కేసులో అయినా విచారణ ముగిసిన తరువాత నిందితుడిని రిమాండ్ లో ఉంచరు. కేసు మొత్తం పూర్తి అయి తీర్పు వెలువడిన తరువాతనే మళ్లీ దోషిగా తేలితే జైలు జీవితం ఉంటుంది అన్నది తెలిసిందే.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు బెయిల్ రావడానికి కారణం ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన నివేదిక. బాబు కంటికి ఆపరేషన్ అని ఆయన ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకునే బెయిల్ ఇచ్చారని న్యాయ నిపుణులు అంటున్నారు ప్రభుత్వం కనుక బాబుకు బెయిల్ రాకుండా ఉండాలని చూస్తే ప్రభుత్వ వైద్యుల నివేదికను బాబుకు అనుకూలంగా ఎలా ఇప్పిస్తుంది అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు విషయంలో వ్యవస్థలను మ్యానేజ్ చేశారు అన్నది మాత్రం జగన్ చేయలేదు అని అంటున్నారు. టీడీపీ ఇక ఆ మాట అనే చాన్స్ లేదు అని కూడా అంటున్నారు.