నిజమా అనిపించేలా క్యాప్ జెమినీ సీఈవో తాజా వ్యాఖ్యలు
ఎవరు ఎంత పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలి? అన్న అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Feb 2025 7:30 PM GMTఎవరు ఎంత పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలి? అన్న అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే. ఇన్పోసిస్ నారాయణమూర్తి కానీ ఎల్ అండ్ టీ సీఈవో కానీ చేసిన వ్యాఖ్యలు పని గంటల మీద పెద్ద దుమారం రేగటమే కాదు.. పని గంటలకు సంబంధించిన అంశం మీద విస్త్రతంగా చర్చ జరిగింది. మొత్తంగా ఉద్యోగులు చేసే పని గంటల కంటే కూడా వారి పని నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదనకు మెజార్టీ వర్గీయులు మద్దతు పలకటం తెలిసిందే. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు క్యాప్ జెమినీ ఇండియా సీఈవో.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరమ్ లో మాట్లాడిన ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయి. వారానికి 47.5 గంటలు పని చేస్తే సరిపోతుందని.. వారాంతాల్లో ఉద్యోగులకు ఈమొయిళ్లు పంపటానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. వారానికి ఎన్ని గంటలు పని చేస్తే బాగుంటుందన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది.
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. రోజూ దాదాపు తొమ్మిదిన్నర గంటల చొప్పున వారానికి ఐదు రోజుల లెక్కన మొత్తం 47.5 గంటల పని సరిపోతుందని.. వీకెండ్స్ లో ఈ-మొయిళ్లు పంపకూడదన్న సూత్రాన్ని తాను నాలుగేళ్లుగా పాటిస్తున్నట్లుగా చెప్పారు. అత్యవసరమైతే కొన్ని సార్లు వీకెండ్లు కూడా పని చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పటం ద్వారా.. ఉద్యోగులు తమ పని విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
తాను వీకెండ్లలో పని చేసినప్పటికి ఆ సమయంలో తాను తన ఉద్యోగులకు ఈమొయిల్స్ పంపలేదన్నారు. పని గంటల కంటే కూడా వాటి ఫలితాలు చాలా ముఖ్యమన్న వ్యాఖ్య నాస్కామ్ ఛైర్ పర్సన్ సింధు గంగాధరన్ వ్యాఖ్యానించారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. క్యాప్ జెమినీ ఇండియా హెడ్ కు భిన్నమైన వ్యాఖ్యలు ఈ సదస్సులో చేసినోళ్లు లేకపోలేదు. ఉదాహరణకు మారికో సీఈవో సౌగతా గుప్తా మాట్లాడుతూ.. అవసరమైతే తాను రాత్రి పదకొండు గంటల సమయంలోనూ ఈమొయిళ్లు పంపిస్తానని చెప్పుకొచ్చారు. ఏమైనా.. ఉద్యోగులకు సెలవు ఇచ్చిన సందర్భంలో వారిని పనికి దూరంగా ఉంచటం ద్వారా వారు వారి కుటుంబంతో నాణ్యమైన కాలాన్ని గడుపుతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.