సైకోగా మారిన సైకియాట్రిస్ట్.. ఐదుగురిని చంపేశాడు!
విచక్షణరహితంగా చేసిన ఇతగాడి కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 మందికి గాయాలకు గురైన దుస్థితి.
By: Tupaki Desk | 22 Dec 2024 5:51 AM GMTఅతడో సైకియాట్రిస్ట్. మానసిక సమస్యలకు సొల్యూషన్ చెప్పే అనుభవం అతడి సొంతం. అయితే.. అలాంటోడే సైకోగా మారాడు. ఐదుగురిని పొట్టనపెట్టుకున్న దారుణం జర్మనీలో చోటు చేసుకుంది. క్రిస్మస్ పండక్కి కాస్త ముందుగా.. హడావుడిగా ఉన్న మార్కెట్లోకి నిర్లక్ష్యంగా కారును నడపటం ద్వారా బీభత్సాన్ని క్రియేట్ చేశాడు. విచక్షణరహితంగా చేసిన ఇతగాడి కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 మందికి గాయాలకు గురైన దుస్థితి. అసలేం జరిగిందంటే..
సౌదీ అరేబియాకు చెందిన తాలెబ్.ఎ.బెర్లిన్ అనే సైకియాట్రిస్ట్ జర్మనీలో నివసిస్తున్నాడు. ఇంతకాలం మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి చికిత్స అందించే ఆ డాక్టర్ కు ఏమైందో కానీ అతని తీరులో మార్పు వచ్చింది. తాజాగా.. క్రిస్మస్ సందర్భంగా మగ్డేబర్గ్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్న వారిపై విచక్షణారహితంగా అతి వేగంతో కారుతో దూసుకెళ్లాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం అక్కడి వారిని షాక్ కు గురి చేసింది.
ఇతడి అరాచకం ఎంతలా సాగిందంటే.. దాదాపు 400 మీటర్ల దూరం వరకు తన కారును దూసుకెళ్లేలా చేశాడు. దీంతో.. అక్కడ ఆరాచకం నెలకొంది. అప్పటివరకు షాపింగ్ హడావుడిలో ఉన్నోళ్లు కాస్తా అప్రమత్తం అయ్యేసరికి జరగాల్సిన దారుణాలు జరిగిపోయాయి. వేగంగా దూసుకొచ్చిన కారు ఐదుగురిని బలి తీసుకుంది. 200 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్నంతనే రంగంలోకి దిగిన అధికారులు ఘటనాస్థలంలోనే నిందితుడ్ని అరెస్టు చేశారు. అతని మానసిక పరిస్థితి ఎలా ఉందన్న దానిపై వైద్య పరీక్షలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.