Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారా?

ఈ వేగానికి బారికేడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:51 AM GMT
అర్థరాత్రి వేళ ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం.. మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారా?
X

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రజాభవన్ వద్ద ఒక కారు క్రియేట్ చేసిన బీభత్సాన్ని గుట్టుగా ఉంచటం.. సోమవారం రాత్రి బయటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకుంటే.. అర్థరాత్రి వేళలో (డిసెంబరు 23, సుమారు 2.45 గంటల వేళలో) వేగంగా దూసుకొచ్చిన కారు.. ప్రజాభవన్ ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది.

ఈ వేగానికి బారికేడ్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా చెబుతున్నారు. కారు ముందు భాగం కూడా పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినంతనే.. అందులోని నుంచి ఒకరు పరారు కాగా.. మరో యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు యువతులు కూడా ఆ కారులో ఉన్నట్లుగా గుర్తించారు. తమ అదుపులోకి తీసుకున్న యువకుడికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తేల్చారు.

అయితే.. కారు ఆగినంతనే.. అక్కడినుంచి పరారైన వ్యక్తికి సంబంధించి వస్తున్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకుంటే.. ఆ వ్యక్తి మరెవరో కాదు బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడన్న మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి అతను కారు ఆగినంతనే పారిపోలేదని.. అతడి వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులే అతడ్ని తప్పించినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. అసలు వ్యక్తిని తప్పించి కొసరు వ్యక్తి అన్నట్లుగా.. మరో వ్యక్తిని ప్రవేశ పెట్టి.. అతను కూడా కారులో ప్రయాణిస్తున్నట్లుగా చూపిస్తున్నారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.

ఈ వాదనకు భిన్నంగా పంజాగుట్ట పోలీసుల వాదన ఉంది. ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొన్న ఉదంతంలో.. తాము కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం పంపామని.. అసలు విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని చెబుతున్నారు. నిజంగానే ఈ ఉదంతం గురించి వివరాలు అందించాలంటే.. పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి కారణం.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను చెక్ చేయటానికి పెద్ద సమయం తీసుకోదని చెబుతున్నారు. అయినప్పటికీ.. పోలీసులు స్పందిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై సమగ్ర నివేదిక తనకు ఇవ్వాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.