విశాఖలో కారు బీభత్సం... ముగ్గురి ప్రాణాలు బలి
అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపింది
By: Tupaki Desk | 8 Aug 2023 9:40 AM GMTఅవును.. మద్యం మత్తు, ఆపై అతివేగం... వెరసి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఎటువంటి సంబంధమూ లేని దంపతులు స్పాట్ లో దుర్మరణం చెందడం చూపరులను కలిచివేసింది. బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ధుర్ఘటన జరిగింది.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... విశాఖ నగరానికి చెందిన ఆరుగురు యువకులు కారులో మద్యం సేవిస్తూ సాగర నగర్ నుంచి రుషికొండ వైపు వేగంగా వస్తున్నారు. కారు రాడిసన్ బ్లూ హోటల్ సమీపానికి వచ్చే సరికి అదుపుతప్పింది. డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది.
ఆ సమయంలో సమయంలో రుషికొండ నుంచి నగరంలోకి వెళ్తున్న దంపతుల బైక్ ను, తర్వాత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులో వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు కూడా మృతి చెందాడు.
అయితే అదృష్టవసాత్తు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న యువకుడితోపాటు ముందు కూర్చన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతని స్నేహితులు కేజీహెచ్ కు తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారులో బీరు బాటిళ్లు ఉండడంతో అందులోని యువకులు మద్యం సేవించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులో మరణించిన యువకుడిని పీఎం పాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన భార్యభర్తలు రాయగడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు రుషికొండ నుంచి నగరంలోకి వస్తూ ఈ ప్రమాదంలో మృతిచెందారు. కారులో ప్రయాణించిన వారిలో ఒక యువకుడు పరారీలో ఉండగా.. మిగిలిన వారు వివరాలు చెప్పే స్థితిలో లేరని పోలీసులు వెల్లడించారు.
కారు వేగంగా ఢీకొట్టడంతో చెట్టు వేళ్లతో సైతం లేచిపోయి పక్కరోడ్డులో పడింది. దీంతో ఈ ఒక్క విషయం ఆ ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం 150 కిలోమీటర్లపైనే వుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మృతదేహాలను కేజీహెచ్ కు తలించారు.