మరో 11 ఏళ్ల తర్వాత మన రోడ్ల మీదకు రోజుకు ఎన్ని కొత్త కార్లు అంటే?
తాజాగా సదరు సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ అవుట్ లుక్ 2024లో భారత్ లో విద్యుత్.. ఇంధనాల వినియోగానికి.. కార్లకు వచ్చే డిమాండ్ ఎంత ఉంటుందన్న విషయాన్ని అంచనా వేసింది.
By: Tupaki Desk | 18 Oct 2024 4:13 AM GMTఆసక్తికర అంచనాను వెల్లడించింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. తాజాగా సదరు సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ అవుట్ లుక్ 2024లో భారత్ లో విద్యుత్.. ఇంధనాల వినియోగానికి.. కార్లకు వచ్చే డిమాండ్ ఎంత ఉంటుందన్న విషయాన్ని అంచనా వేసింది. దీని ప్రకారం మరో పదకొండేళ్లకు అంటే.. 2035 నాటికి ప్రతి రోజూ కొత్తగా రోడ్ల మీదకు వచ్చే కార్లు ఏకంగా 12వేలు ఉంటాయనిఅంచనా వేసింది.
2035 నాటికి ఏసీ విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగానికి మించిపోతుందని లెక్క కట్టింది. చమురు వినియోగం.. దిగుమతికి సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్ లో చమురు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని అంచనా వేసిన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా చమురు డిమాండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని పేర్కొంది.
2023లోఐదో భారీ ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్.. మరో ఐదేళ్ల నాటికి (2028) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేసింది. భారత్ లో పెరిగే జనాభాకు తగ్గట్లే వచ్చే పదేళ్లలో మిగిలిన దేశాలతో పోలిస్తే ఇంధనాల డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొంది. 2035 నాటికి ఐరన్.. స్టీల్ ఉత్పత్తి 70 శాతం.. సిమెంటు ఉత్పత్తి 55 శాతం.. ఏసీల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయని లెక్క కట్టింది. ఈ సమయానికి ఏసీల కోసం వినియోగించే విద్యుత్ అన్నది ఏడాది వ్యవధిలో యావత్ మెక్సికో వాడేసే విద్యుత్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
భారత్ లో మొత్తం ఎనర్జీ వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1400 గిగావాట్లకు చేరనుంది. సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి 30 శాతం అధికంగా ఉంటుందని లెక్క కట్టింది. రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి.. ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొంది.
శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని.. వంట కోసం పర్యావరణరహితమైన ఇంధనాన్ని సమకూర్చుకోవాలని.. విద్యుత్ రంగం విశ్వసనీయత పెంచాలని పేర్కొంది. భారత్ లో ఎలక్ట్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని.. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారాస్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుతుందని పేర్కొంది. టూవీలర్లు.. త్రీ వీలర్లకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా పేర్కొని.. ప్యాసింజర్ కార్ల మార్కెట్ లో నాలుగో స్థానంలో ఉన్నట్లు చెప్పింది. వచ్చే పదేళ్లలో భారత్ లో కొత్తగా 3.7 కోట్లకు పైనే కార్లు.. 7.5 కోట్లకు పైనే టూవీలర్లు.. త్రీ వీలర్లు రోడ్ల మీదకు రానున్నట్లుగా పేర్కొంది. 2035 నాటికి రోడ్ల మీద ప్రయాణికుల రవాణా రద్దీ కారణంగా కర్బన ఉద్గారాలు 30శాతం పెరగనున్నట్లుగా పేర్కొంది. మొత్తంగా చూస్తే.. దీనికి తగ్గట్లు మౌలిక వసతుల ఏర్పాటు అంశంపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.