బండికి ర్యాంగింగ్ మామూలుగా లేదుగా...!
కానీ ఏమీ కానీ వేళ అసలు కాని కాలంలో కితాబు అయినా మతాబులా వెలగదు సరిగాదా చిచ్చుబుడ్డిలా చిచ్చు పెడుతుంది.
By: Tupaki Desk | 16 Nov 2023 3:00 AM GMTఏదైనా అతి అయితే అది ప్రమాదం, కోపం విసుగు తెప్పిస్తాయి. క్యాడర్ అభిమానం అలాంటిదే. అయిన వేళలో అన్నీ బాగున్న టైం లో ఏది చెప్పినా హాయిగా ఉంటుంది. విన సొంపుగా ఉంటుంది. కానీ ఏమీ కానీ వేళ అసలు కాని కాలంలో కితాబు అయినా మతాబులా వెలగదు సరిగాదా చిచ్చుబుడ్డిలా చిచ్చు పెడుతుంది.
ఇపుడు బీజేపీ తెలంగాణా మాజీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు. ఒకనాడు సీఎం అంటే ఆయన ఆనందించేవారు. తాను వస్తూంటే క్యాడర్ అంతా కాబోయే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు ఇస్తూంటే బండి ముఖం వెలిగిపోయేది. కానీ ఆనాటి రోజులు వేరు. బండి బీజేపీకి ప్రెసిడెంట్.
ఇపుడు మాజీ అయ్యారు. తెలంగాణా బీజేపీలో బండి ప్రాధాన్యత తగ్గిపోయింది అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తాను అన్నా వినకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దించేశారు. దాంతో ఆయన ఎన్నికల గోదావరి ఈదుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అనుచరులు ఇచ్చే స్లోగన్స్ బండికి గన్స్ మాదిరిగా తగులుతున్నాయట. ఆపండి మీ గోల అని ఎంత అంటున్నా వారు వినడంలేదులా ఉంది.
సీఎం బండి అంటూ చేస్తున్న నినాదాలు కాస్తా ర్యాంగింగ్ గా మారి బండిని సతాయించేస్తున్నాయి అని అంటున్నారు. అక్కడికి బండి శాంతంగానే చెబుతున్నారు. సీఎం అని గోల చేసి ఉన్న పోస్ట్ ఊడగొట్టారుగా బాబూ ఇపుడు మళ్ళీ ఈ గోల ఏంటీ అని. అయినా క్యాడర్ అసలు ఎక్కడా తగ్గడంలేదు.
దాంతో బండి మళ్ళీ బరస్ట్ అయిపోయారు. తాజాగా బండి బిచ్కుందలో విజయశంఖారావం రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో బండి సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అయ్యా మీరు ఇలా సీఎం సీఎం అని నా పోస్టును ఊడగొట్టారని ఒకింత కోపం ప్రదర్శించారు.
ఇలా సీఎం అని మళ్లీ మళ్లీ అంటూ ఇప్పుడు ఉన్న పోస్టును కూడా ఊడపీకవద్దురా బాబూ అని క్యాడర్ కి మొక్కుతున్నారు. సీఎం కావడం అన్నది తన చేతులలో ఉండదని, బీజేపీలో ఎమ్మెల్యేలు అధిష్ఠానం అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటేనే ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటిస్తారని బండి చెప్పుకొచ్చారు.
మొత్తానికి సీఎం గోల ఆపండి అని బండి సంజయ్ మెత్తగానూ గట్టిగానూ విసుక్కున్నారు. అయినా కానీ ఎవరికైనా పదవి అంటే ఇష్టమే. కానీ చేతిలో ఉన్న పదవి పోయి దిగాలుగా ఉన్న వేళ ఇపుడు మునగచెట్టు ఎక్కించినట్లుగా క్యాడర్ చేసే నినాదాలు పొలిటికల్ ర్యాగింగ్ గానే తోస్తాయని అంటున్నారు. పాపం బండి బాధను బీజేపీ కార్యకర్తలు అసలు అర్ధం చేసుకోవడం లేదు. బండి కి జై అంటే ఓకే కానీ సీఎం అంటేనే ఆయన కోప్పడాల్సి వస్తోంది. ఈ గోల ఎపుడు ఆగుతుందో మరి.